ప్రముఖ విద్యుత్ బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్ ఇంటెల్లికార్ప్ తీసుకొచ్చిన రివోల్ట్ ఆర్‌వీ400 మరోసారి అమ్మకాల్లో దూసుకెళ్లింది. గురువారం బుకింగ్స్ ప్రారంభించగా.. నిమిషాల్లోనే బైక్‌లన్నీ అమ్ముడయ్యాయని రివోల్ట్ తెలిపింది. అయితే.. ఎన్ని బైక్‌లను విక్రయానికి ఉంచారో మాత్రం తెలియజేయలేదు.
గత నెల తొలిసారి బుకింగ్స్‌లోనూ రివోల్ట్ సత్తా చాటింది. తొలి రెండు గంటల్లోనే రూ.50 కోట్లు విలువ చేసే బైక్‌లకు ఆర్డర్లు అందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, ముంబయి, పుణె, దిల్లీ, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో ఈ బైక్‌లను బుకింగ్‌కి అందుబాటులో ఉంచారు. 3.24కిలోవాట్ల లిథియం ఆయాన్ బ్యాటరీతో రూపొందించిన ఆర్‌వీ 400 ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుంది. ఈ బ్యాటరీకి ఎనిమిదేళ్లు లేదా 1.5లక్షల కిలోమీటర్ల వరకూ సంస్థ హామీనిస్తోంది. బ్యాటరీ మొత్తం ఛార్జింగ్ అయ్యేందుకు నాలుగున్నర గంటలు పడుతుంది.