దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు మండిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ధరలను తగ్గించేందుకుగానూ.. వ్యాపారుల వద్ద నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. 2022 మార్చి 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.
'కేంద్రం తాజా నిర్ణయంతో వంట నూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఊరట కలిగించే విషయం' అని ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిల్వలు ఎంత? వాటిని ఎలా వినియోగిస్తున్నారు అనే అంశాలను పరిగణించి పరిమితులపై నిర్ణయం తీసుకోవాలని ఇందులో సూచించింది కేంద్రం.
ఇప్పటికే ఎన్సీడీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై..మస్టర్డ్ ఆయిల్ ట్రేడింగ్ అక్టోబర్ 8 నుంచి నిలిపివేశారు.
వారికి మినహాయింపు..
అయితే కొంతమంది ఎగుమతి, దిగుమతిదారులకు మినహాయింపు ఇచ్చింది కేంద్రం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్.. ఎక్స్‌పోర్టర్- ఇంపోర్టర్ కోడ్ ఇచ్చిన వారికి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని పేర్కొంది.
చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే.. ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్‌లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు నూనెలు, నూనె గింజల పరిమిమతుల వివరాలని కేంద్రప్రభుత్వం వెబ్సైట్లో అప్డేట్ చేయాలని కోరింది.
ప్రస్తుత ధరలు ఇలా..
- దేశంలో సన్ ఫ్లవర్ నూనె లీటర్.. సగటున ప్రస్తుతం రూ.170.09గా ఉంది. గత ఏడాది (రూ.122.82)తో పోలిస్తే ఇది 38.48 శాతం ఎక్కువ.
- పామ్ ఆయిల్ ధర కూడా 38 శాతం పెరిగి రూ.132.06 వద్దకు చేరింది. గత ఏడాది అక్టోబర్‌లో దీని ధర రూ.95.68గా ఉంది.
- సోయా నూనె సగటు ధర అక్టోబర్ 9 ప్రకారం.. లీటర్‌కు రూ.154.95 వద్ద ఉంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 45.15 శాతం ఎక్కువ. 2020 అక్టోబర్‌లో ఈ నూనె రూ.106గా ఉంది.
ఈ స్థాయి ధరలు ఎందుకు?
దేశీయంగా వంట నూనెల ధరలు కేవలం ఏడాది కాలంలో 46.15 శాతం పెరిగాయి. అంతర్జాతీయ కారణాలు, దేశీయంగా సరఫరా తగ్గటం వంటివి ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది.
ఇదీ చదవండి:ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లకు నేడే లాస్ట్.. త్వరపడండి!