స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2019 నుంచి తగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2020లో ఈ డిపాజిట్లు 13 ఏళ్ల గరిష్ఠానికి చేరాయని వచ్చిన కథనాలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. డిపాజిట్ల విలువలో మార్పులకు గల కారణాలపై స్విట్జర్లాండ్ అధికారుల నుంచి వివరణ కోరినట్లు తెలిపింది.
ఈ సందర్భంగా.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల సంఖ్య సగానికి పడిపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కానీ ఇందుకు సంబంధించిన గణాంకాలు వెల్లడించలేదు.
"నిజానికి 2019 చివరి నాటికి కస్టమర్ డిపాజిట్లు పడిపోయాయి. ట్రస్టీల ద్వారా దాచుకున్న నిధులు సగానికి పైగా తగ్గాయి. బాండ్లు, ఆర్థిక సాధనాల విభాగంలో అధిక పెరుగుదల నమోదైంది. నగదు తగ్గుదల, పెరుగుదలకు కారణాలు సహా తమ అభిప్రాయాలు చెప్పాలని స్విస్ అధికారులను కోరాం."