కొవిడ్ -19తో ఎదురైన ఆర్థిక ఒత్తిడి కారణంగా రుణాలను ఎగవేసే ప్రయత్నాల్లో ఉన్న సంస్థలకు ఉపశమనం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లపై దివాలా ప్రక్రియ అమలు చేసే అవకాశాలను తగ్గించేందుకు.. ఎగవేత పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.కోటికి పెంచింది. ఈ నిర్ణయంతో భారీ స్థాయిలో కంపెనీలు దివాలాలోకి జారకుండా జాగ్రత్త వహించవచ్చన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
దివాలా నియమావళి కింద ఏడాది పాటుఎలాంటి చర్యలు ఉండవన్నారు. కరోనా సంక్షోభంలో తీర్చలేని రుణాలను దివాలా కింద పరిగణించమని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించారు.
కంపెనీల చట్టంలో మార్పులు..
- కంపెనీల చట్టం ద్వారా డిఫాల్ట్‌లను ఎదుర్కొనే సంస్థలకు ఇకపై శిక్షలు ఉండవు. 5 ప్రత్యామ్నాయ విధానాల్లో వాటిని పరిష్కరిస్తారు.
- సీఎస్ఆర్ రిపోర్టింగ్, బోర్టు రిపోర్టు, ఢిపాల్ట్ ఫైలింగ్, ఏజీఎమ్(వార్షిక సమావేశం) ఆలస్యం వల్ల కంపెనీ చట్టం నుంచి ఎదుర్కొనే చర్యలు ఇకపై ఉండవు.