తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్‌ రిటైల్‌కు మరింత 'ఫ్యూచర్‌' - మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సర్వే

ఫ్యూచర్​ గ్రూప్​నకు చెందిన వినియోగదారు వ్యాపారాలను రిలయన్స్​ ఇండస్ట్రీస్​ కొనుగోలు చేయడం వల్ల కంపెనీ రిటైల్​ విభాగం మరింత బలపడుతుందని అభిప్రాయపడుతోంది మూడీస్​ ఇన్వెస్ట్​ర్​ సర్వీస్​. అయితే రిలయన్స్‌ తన రిటైల్‌ వ్యాపార వ్యూహాలను ఎలా అమలు చేస్తుందన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది.

Reliance's acquisition of Future Group to strengthen its retail footprint: Moody's
రిలయన్స్‌ రిటైల్‌కు మరింత 'ఫ్యూచర్‌'

By

Published : Sep 3, 2020, 8:32 AM IST

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన వినియోగదారు వ్యాపారాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కొనుగోలు చేయడం వల్ల కంపెనీ రిటైల్‌ విభాగం మరింత బలోపేతం అవుతుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అభిప్రాయపడుతోంది. ఫ్యూచర్‌ వినియోగదారు వ్యాపారాన్ని రూ.24,713 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు గతవారం ఆర్‌ఐఎల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఈ లావాదేవీ వల్ల భారత్‌లోనే అతిపెద్ద సంస్థాగత రిటైలర్‌గా రిలయన్స్‌కున్న స్థానం మరింత పదిలమవుతుంది. ఆదాయాలు ఇంకా పెరుగుతాయ’ని ఆ రేటింగ్‌ ఏజెన్సీ అంచనా వేసింది.

కొనుగోలు ధర తక్కువే..

కొనుగోలు ధర 3.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నప్పటికీ.. రిలయన్స్‌కున్న 155 బిలియన్‌ డాలర్ల మొత్తం ఆస్తులు, 12.8 బి. డాలర్ల ఎబిటాతో పోలిస్తే అది చాలా తక్కువ అని మూడీస్‌ అభిప్రాయపడింది. ‘అదీకాక ఇటీవల కంపెనీ ఆస్తుల నగదీకరణ, ఈక్విటీ నిధుల సేకరణ కార్యక్రమాలు సరిపడా నిధుల నిల్వను సృష్టించాయి. రుణ రేటింగ్‌పై ఎటువంటి ప్రభావం పడకుండానే ఈ కొనుగోలు చేసే అవకాశం ఉంద’ని మూడీస్‌ తెలిపింది. ప్రతిపాదిత కొనుగోలు అనంతరం కూడా రిలయన్స్‌ తన నికర రుణ రహిత సంస్థగానే కొనసాగుతుందని అంచనా కట్టింది.

మరింత సులువుగా జనంలోకి..

‘ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలు నిర్వహిస్తున్న స్టోర్లకు తోడు రిలయన్స్‌కున్న విస్తృత నెట్‌వర్క్‌ ద్వారా ఇరు కంపెనీలకు చెందిన బ్రాండ్లను విక్రయించడం మరింత సులువు కానుంది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా.. అవి ఆర్‌ఐఎల్‌పై ప్రభావం చూపుతాయని మేం భావించట్లేద’ని వివరించింది. కేవలం ఆస్తులు, వ్యాపారాలను మాత్రమే ఆ కంపెనీ కొనుగోలు చేస్తోందని గుర్తుచేసింది.

వ్యూహంపైనే భవిష్యత్‌..

రిలయన్స్‌ తన రిటైల్‌ వ్యాపార వ్యూహాలను ఎలా అమలు చేస్తుందన్నదానిపై.. భారత్‌లో వినియోగదారు గిరాకీ ఎంత వేగంగా పుంజుకుంటుందన్న దానిపై ఆధారపడి కొత్త వ్యాపారంలో వృద్ధి కనిపించబోతుందని అంచనా వేసింది. వచ్చే కొద్ది నెలల్లో కంపెనీ 8-10 బి. డాలర్ల మేర నిధులను సమీకరించొచ్చని.. ఇది కూడా సానుకూలాంశమేనని తెలిపింది.

ఇదీ చదవండి:జట్టుకట్టిన అంబానీ, బియానీ- ఒప్పందం ఖరారు

ABOUT THE AUTHOR

...view details