రిలయన్స్ జియోలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్వీటీ సంస్థ కొహెల్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్ (కేకేఆర్) జియోలో 11 వేల 367 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా జియోలో 2.32 శాతం కేకేఆర్‌కు బదిలీ కానుంది.
పెట్టుబడుల వెల్లువ
గత 4 వారాల్లో జియోలో ఇది ఐదో పెట్టుబడి కాగా... ఇప్పటి వరకు కేకేఆర్ సంస్థ ఆసియాలో పెట్టిన అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదే కావడం విశేషం.
తాజా ఒప్పందంతో కలుపుకుంటే జియోలో విదేశీ పెట్టుబడులు రూ.78, 562 కోట్లకు పెరిగాయి. జియోలో ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ 4.91 లక్షల కోట్లు కాగా... ఎంటర్‌ప్రైజ్ విలువ 5.16 లక్షల కోట్లుగా ఉంది.
ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన పెట్టుబడి సంస్థ కేకేఆర్‌ను స్వాగతించడం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు. భారతీయ డిజిటల్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి, మార్చడానికి తాము చేస్తున్న ప్రయత్నంలో... కేకేఆర్ విలువైన భాగస్వామి అని ఆయన అన్నారు. భారత్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ చేస్తున్నట్టుగా... దేశంలోని డిజిటల్ ఎకోసిస్టమ్‌ను మార్చే సత్తా కొన్ని సంస్థలకే ఉందని కేకేఆర్ సహ వ్యవస్థాపకులు హెన్రీ క్రావిస్ అభిప్రాయపడ్డారు.
జియో ప్లాట్‌ఫాంలో పెట్టుబడిదారులు ఇదీ చూడండి:విమాన ఛార్జీలపై 3 నెలల నియంత్రణ