తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2022, 8:52 AM IST

ETV Bharat / business

క్లోవియాలో 89శాతం వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్‌ రిటైల్‌

Reliance Retail acquires Clovia: రిలయన్స్ మరో సంస్థలో 89 శాతం ఈక్విటీని కోనుగోలు చేసింది. లోదుస్తులను ఉత్పత్తి చేస్తున్న క్లోవియా అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఇందుకు సుమారు రూ. 950కోట్లను వెచ్చించింది.

Reliance Retail acquires Clovia
రిలయన్స్‌ రిటైల్‌

Reliance Retail acquires Clovia: లోదుస్తుల సంస్థ క్లోవియాలో 89 శాతం ఈక్విటీ వాటాను రూ.950 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) ప్రకటించింది. క్లోవియా వ్యాపారాలను నిర్వహించే పర్పుల్‌ పాండా ఫ్యాషన్స్‌లో 89 శాతం వాటాను సెకండరీ వాటా కొనుగోలు, ప్రాథమిక పెట్టుబడుల ద్వారా కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. కంపెనీలో మిగిలిన వాటా వ్యవస్థాపక బృందం, మేనేజ్‌మెంట్‌ చేతిలో ఉందని తెలిపింది. తాజా కొనుగోలుతో లోదుస్తుల విభాగంలో ఆర్‌ఆర్‌వీఎల్‌ మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే జివామే, అమాంటే వంటి బ్రాండ్లను రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. 2013లో క్లోవియాను పంకజ్‌ వెర్మానీ, నేహాకాంత్‌, సుమన్‌ చౌధ్రీలు ప్రారంభించారు.

సుజుకీ రూ.10,445 కోట్ల పెట్టుబడులు

విద్యుత్‌ వాహనాలు, వాటికి అవసరమైన బ్యాటరీల తయారీ కోసం భారత్‌లో 150 బిలియన్‌ యెన్‌ల (సుమారు రూ.10,445 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం సుజుకీ కార్పొరేషన్‌ ఆదివారం వెల్లడించింది. 2026 వరకు ఈ భారీ మొత్తం పెట్టుబడులు పెడతారు. బ్యాటరీ విద్యుత్‌ వాహనాలు (బీఈవీ), బీఈవీ బ్యాటరీలను గుజరాత్‌లో తయారు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నట్లు తెలిపింది. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద, భారత ప్రధాని మోదీ సమక్షంలో దిల్లీలో జరిగిన 'ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ఫోరం'లో ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. 'ఆత్మనిర్భర్‌ భారత్‌' లక్ష్య సాధనకు తమ వంతు తోడ్పాటు అందజేస్తామని సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ) డైరెక్టర్‌, ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ తెలిపారు. ఈ క్రమంలో చిన్న కార్లతో ఉద్గార రహిత లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తామన్నారు. విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు తమ అనుబంధ సంస్థ సుజుకీ మోటార్‌ గుజరాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎంజీ) రూ.7,300 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. 2025 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి వీలుగా మరో రూ.3,100 కోట్లు అదనంగా కేటాయిస్తామని వెల్లడించారు.'

ఇదీ చూడండి:

బీఎస్‌ఎన్‌ఎల్‌తో బీబీఎన్‌ఎల్‌ విలీనం.. జరిగే మార్పులివే!

ABOUT THE AUTHOR

...view details