దేశీయంగా ఇ-కామర్స్ వ్యాపారం ప్రస్తుతం 7800 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.85 లక్షల కోట్ల) స్థాయిలో ఉండగా, ఇది 2025 కల్లా 10000 కోట్ల డాలర్ల (సుమారు రూ.7.50 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందనే అంచనా. ఇందులో నిత్యావసరాల విభాగంపై సంస్థలు తీవ్రంగా దృష్టి సారించాయి.
నిత్యావసరాల ఆన్‌లైన్ విపణికి సంబంధించి 2019లో 80 శాతం వాటా బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌దే అయినా, వాట్సాప్ సాయంతో ఆర్డర్లు తీసుకుంటున్న జియోమార్ట్ సగానికి పైగా విపణిని దక్కించుకుంటుందనే అంచనాను గోల్డ్‌మన్ సాక్స్ వ్యక్తం చేసింది.
'ఫ్యూచర్' కోసం
దేశీయ రిటైల్ విపణిపై పట్టుసాధించేందుకు దిగ్గజ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 95,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.71.25 లక్షల కోట్ల) విలువైన దేశీయ రిటైల్ విపణి 2025-26కు 1.3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.97.50 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందనే అంచనాలే ఇందుకు కారణం. ఆన్‌లైన్‌లో జియో మార్ట్ ద్వారా పోటీకి సై అంటున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, సంప్రదాయ విపణిలో అగ్రగామిగా మారేందుకు ఫ్యూచర్‌గ్రూప్ రిటైల్‌ను స్వాధీనం చేసుకునేందుకు తుది సన్నాహాల్లో ఉంది.
దేశంలోని 6700 పట్టణాల్లో 12,000కు పైగా రిటైల్ విక్రయశాలలను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... ఫ్యూచర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌గ్రూప్‌నకు చెందిన రిటైల్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకునేందుకు రూ.24,000-27000 కోట్లు (320-360 కోట్ల డాలర్లు) చెల్లించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఫ్యూచర్‌గ్రూప్ రిటైల్ కింద బిగ్‌బజార్, ఫ్యాషన్ అట్ బిగ్‌బజార్ (ఎప్‌బీబీ), బ్రాండ్‌ఫ్యాక్టరీ, ఇజోన్ పేరిట దాదాపు 1500కు పైగా విక్రయశాలలున్నాయి. ఇరు సంస్థల మధ్య సంప్రదింపులు చాలాకాలం క్రితమే ఆరంభమైనా, ఫ్యూచర్ రిటైల్ విలువపైనే ప్రతిష్ఠంభన సాగుతోందని సమాచారం. ఫ్యూచర్‌గ్రూప్ రిటైల్‌కు సంబంధించిన రుణాలను కలిపే ఈ కొనుగోలు ఉంటుంది. రిలయన్స్ అనుబంధ రిటైల్ ఆధీనానికి చేరకముందే, ఫ్యూచర్ రిటైల్ సహా 5 లిస్టెడ్ సంస్థలు కూడా ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్‌ఈఎల్)లో విలీనం అవుతాయని సమాచారం. ఈ విలీనం పూర్తయితే, దేశంలోనే అతిపెద్ద రిటైల్ విక్రయదారుగా రిలయన్స్ రిటైల్ అవతరిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ క్విక్ సేవలు
ఆర్డరు ఇచ్చిన గంటన్నర (90 నిమిషాల) వ్యవధిలోనే నిత్యావసరాలు ఇంటికి చేరవేసేందుకు 'ఫ్లిప్‌కార్ట్ క్విక్' సేవకు శ్రీకారం చుట్టినట్లు వాల్‌మార్ట్ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నిత్యావసరాల ఆన్‌లైన్ ఆర్డర్లలో ముందున్న అమెజాన్ ఇండియాతో పాటు ముకేశ్ అంబానీ నేతృత్వంలో దూసుకొస్తున్న జియోమార్ట్‌కు పోటీగా ఈ సేవకు సిద్ధమైంది. నిత్యావసర సరకులతో పాటు తాజా కూరగాయలు, మాంసం, డెయిరీ ఉత్పత్తులు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్టేషనరీ, ఇంటిలో వినియోగించే చిన్నపాటి పరికరాలు కలిపి దాదాపు 2000 రకాల ఉత్పత్తులను ఈ సేవ కింద సరఫరా చేస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తొలుత బెంగళూరులో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించినా, ఈ ఏడాది ఆఖరులోపు దేశంలోని 6 ప్రధాన నగరాలకు విస్తరిస్తామని ఫ్లిప్‌కార్ట్ వైస్‌ప్రెసిడెంట్ సందీప్ కార్వా వివరించారు. సరఫరా కోసం షాడోఫాక్స్ సంస్థను ఎంచుకున్నామన్నారు. ఆయా పట్టణాల్లో గొలుసుకట్టు విక్రయసంస్థలతో ఒప్పందం చేసుకుని, నాణ్యమైన సరకులు త్వరగా చేరవేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:భారత్‌కు ఏడీబీ మరో రూ.22.45 కోట్ల సాయం