శుద్ధ ఇంధన రంగంలో(Reliance Green Energy) ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుస ఒప్పందాలతో దూసుకుపోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎస్ఎల్)(Reliance New Energy Solar Limited) రూ.218 కోట్లకు జర్మనీ సంస్థ నెక్స్‌వేఫ్ జీఎంబీహెచ్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు.. డెన్మార్క్ చెందిన 'స్టైస్‌డాల్ టెక్నాలజీ' సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
నెక్స్‌వేఫ్ సంస్థ ఫొటోవోల్టాయిక్ సోలార్ వేఫర్లు తయారు చేస్తుండగా.. డెన్మార్క్ సంస్థ స్టైస్‌డాల్.. హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్లను భారత్‌లోనే తయారుచేసే విధంగా సాంకేతిక సహకారం అందించనుంది. ఇటీవలే 771 మిలియన్ డాలర్లకు సోలార్ ప్యానెళ్లు తయారు చేసే ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్(Reliance Green Energy) .. షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది.
వచ్చే కొన్నేళ్లలో 4 గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటుచేయాలని భావిస్తున్న రిలయన్స్(Reliance Green Energy) ఆ దిశగా సాంకేతికత సహకారం కోసం ఒప్పందాలు, కొనుగోళ్లు చేపడుతోంది. పెరుగుతున్న భారత ఆర్థికవ్యవస్థ అవసరాలకు అనుగుణంగా గ్రీన్‌ఎనర్జీని చౌకగా అందించేందుకు నెక్స్‌వేఫ్‌తో భాగస్వామ్యం ఉపకరిస్తుందని ముకేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్లలోగా హైడ్రోజన్ ఎనర్జీ కేజీ ఒక డాలర్‌కే లభించేలా చేయాలన్న తమ లక్ష్యసాధనకు.. 'స్టైస్‌డాల్' భాగస్వామ్యం ఉపకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.