రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్‌ను దాటేసి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా ఆవిర్భవించింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలైన డిజిటల్, రిటైల్ వ్యాపారాలు దూకుడుగా ఉన్నందున ఈ కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారమే కంపెనీ మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లను తాకడం వల్ల ఎక్సాన్ మొబిల్‌ను దాటేసింది. ఈ రెండింటి మధ్య బిలియన్ డాలర్ల తేడా ఉంది. ఓ పక్క రిలయన్స్ షేరు పెరుగుతుండగా.. మరోపక్క ఎక్సాన్ షేరు పడిపోతోంది. ఈ ఏడాది 39శాతం విలువ కోల్పోయింది. చమురు డిమాండ్ తగ్గుదల రోజుకు 30 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉంది. ఇది చాలా పెద్ద మొత్తం. చమురు డిమాండ్ తగ్గడమే ఎక్సాన్‌పై ప్రభావం చూపింది. మరోపక్క రిలయన్స్ వ్యాపార వైవిధ్యం కారణంగా పెట్రోలియం విభాగంలో లాభాలు తగ్గినా.. డిజిటల్, రిటైల్ విభాగాలు కాపాడాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి రిలయన్స్ ఆదాయంలో 80శాతం పెట్రోలియం వ్యాపారం నుంచే వచ్చింది.
కాంబినేషన్స్ అదుర్స్..
రిలయన్స్ తన అనుబంధ వ్యాపారాలను అద్భుతంగా వినియోగించుకుంటోంది. రిలయన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడింది. జియో వచ్చిన కొత్తల్లో రిలయన్స్ డిజిటల్ ఊతకర్రలాగా పనిచేసింది. ఇలాంటివి ఒక పక్కా ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు అనుకొని చేయడం సాధ్యం కాదు. ఏది ముందు.. ఏది తర్వాత మార్కెట్లోకి రావాలనే అంశాలపై పట్టు ఉండాలి. రిలయన్స్ వ్యాపార శైలిలో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. భారత్ రిటైల్ రంగంలో పట్టు బిగించాక.. టెలికాం రంగంలోకి వచ్చింది. డేటా మార్కెట్‌లో తిరుగు లేని ఆధిపత్యం సంపాదించాక ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెడుతోంది. దీంతోపాటు కస్టమర్లు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే విధంగా వ్యాపార వ్యూహాన్ని సిద్ధం చేసింది. రిలయన్స్ రిటైల్‌తోపాటు స్థానిక విక్రేతలను కూడా భాగస్వాములుగా చేయనుండటం వల్ల మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోయే అవకాశం దీనికి లభించింది. కొన్నేళ్ల క్రితమే ప్రధాన వ్యాపారమైన రిఫైనింగ్, పెట్రో కెమికల్స్‌కు అనుబంధంగా రిటైల్ పెట్రోల్ పంపులను విస్తరించాలని నిర్ణయించింది. అప్పట్లో బ్రిటిష్ పెట్రోలియంతో జట్టుకట్టింది.
కొనుగోళ్లకు వెనుకాడని వైనం..
రిలయన్స్ డిజిటల్, మీడియా మార్కెట్‌లో బలపడటం కోసం భారీగా కంపెనీల కొనుగోళ్లకు తెరతీసింది. ఈ క్రమంలో నెట్‌వర్క్ 18, కలర్స్, వైకామ్, మనీకంట్రోల్ వంటి ఛానళ్లను సొంతం చేసుకొంది. దీంతోపాటు బాలాజీ టెలిఫిల్మ్ వంటి హిందీ దిగ్గజ నిర్మాణ సంస్థను ఒడిసిపట్టింది. హాత్‌వే కేబుల్స్, డెన్ నెట్‌వర్క్స్, డేటాకామ్ వంటి కేబుల్ సంస్థలు రిలయన్స్ గూటికి చేరాయి. ఇవి దేశంలోని మారుమూల ప్రాంతానికి రిలయన్స్‌ను చేర్చాయి. రిలయన్స్ ఉత్పత్తులను మార్కెటింగ్‌కు ఇవన్నీ మంచి వేదికలుగా నిలుస్తాయి.
అసలు ఈ వ్యాపార వైవిధ్యం దేనికి..?