రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉదారతను చాటుకున్నారు. తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల భద్రతకు పెద్దపీట వేశారు. కరోనా మహమ్మారికి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోనున్నారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆ ఉద్యోగి చివరిసారి తీసుకున్న జీతాన్ని ఐదేళ్ల పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నీతా అంబానీతో కలిసి ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు.
ప్రియమైన సహచరులకు,
కొవిడ్-19 గతంలో మనమెప్పుడూ చవిచూడని బాధాకరమైన అనుభవాలను పంచింది. మన సహచరులు, వారి కుటుంబ సభ్యుల మరణాలు కలచివేస్తున్నాయి. ఆ విషాదాల నుంచి కోలుకొనేందుకు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం.
చనిపోయిన వారి నష్టం పూడ్చలేనిది. 'ఒకే రిలయన్స్ కుటుంబం'గా అవి మన మనసుపై పెనుభారమే మోపాయి. మన ఆత్మీయుల నష్టాన్ని పూడ్చలేక పోయినా వారి కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికీ అండగా నిలిచేందుకు మేం కట్టుబడ్డాం. వారికి విశ్వాసం కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
రిలయన్స్‌లో మనందరినీ కలిపే ఉమ్మడి బంధమేదైనా ఉందంటే అది ‘వీ-కేర్’. అందుకే మేం ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తాం. ఈ బాధాకర పరిస్థితుల్లో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ అండగా నిలబడుతుంది. అందుకే మేం 'రిలయన్స్ కుటుంబ మద్దతు, సంక్షేమ పథకం' ప్రకటిస్తున్నాం.
- చనిపోయిన ఉద్యోగి నామినీకి ఐదేళ్లు జీతభత్యాలు అందజేస్తాం. చివరగా తీసుకున్న వేతనాన్నే అందిస్తాం.
- మృతిచెందిన ఉద్యోగి పిల్లలు భారతదేశంలోని ఏ విద్యా కేంద్రంలోనైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసే వరకు 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి, పుస్తకాల ఫీజుల్ని అందిస్తాం.
- పిల్లలు డిగ్రీ పూర్తి చేసేంత వరకు చనిపోయిన ఉద్యోగి భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల ప్రీమియం ఆస్పత్రి ఖర్చులన్నీ 100% మేమే భరిస్తాం.
ఇక కొవిడ్ బారిన పడ్డ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి సోకినా ప్రత్యేకంగా కొవిడ్ సెలవులు తీసుకోవచ్చు. మానసికంగా, శారీరకంగా కోలుకొనేంత వరకు సెలవులు తీసుకోవచ్చు.
ఇదీ చదవండి:రిలయన్స్ ఉద్యోగులకు మే 1 నుంచి ఉచిత టీకా
ఇదీ చదవండి:11శాతం ఆక్సిజన్ ఉత్పత్తి రిలయన్స్ నుంచే!