కరోనా వల్ల తీవ్రంగా కుదేలైన రంగాల్లో 'రియల్ ఎస్టేట్' ఒకటి. 2016లో నోట్ల రద్దు సహా ఇతర కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రంగానికి.. 2020లో కరోనా మహమ్మారి వల్ల మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీనితో ఇళ్ల విక్రయాలు, కార్యాలయ స్థలాల లీజింగ్‌లు 40-50 శాతం పడిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ సంక్షోభం నుంచి తేరుకుని.. 2021లో విక్రయాలు పెరిగి రియల్టీ రంగం కోలుకుంటుందని ఆశిస్తున్నారు విశ్లేషకులు.
స్థిరమైన ఆస్తి ధరలు, గృహ రుణాలపై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు, డెవలపర్లు అందిస్తున్న డిస్కౌంట్లు, ఇతర పథకాలు, కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ రేట్లను తగ్గించడం వంటి కారణాలతో.. విక్రయాలు పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
విక్రయాలు తగ్గేందుకు కారణాలు..
కరోనా విజృంభణతో రెండు నెలల పాటు విధించిన కఠిన లాక్డౌన్ వల్ల గృహ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. డిజిటల్ మాధ్యమాల ద్వారా విక్రయాలు పెంచుకునేందుకు రియల్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా సెప్టెంబర్ వరకు గృహ విక్రయాల్లో క్షీణత నమోదవుతూనే వచ్చింది.
పండుగ సీజన్‌తో అక్టోబర్‌లో ఇళ్ల విక్రయాలు స్వల్పంగా పుంజుకున్నాయి. అయినప్పటికీ చాలా పట్టణాల్లో అమ్మకాలు కరోనా ముందు స్థాయికి చేరాల్సిన అవసరముందని రియల్టీ డెవలపర్లు చెబుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ఇళ్ల విక్రయాలు దేశీయంగా ఏడు ప్రధాన నగరాల్లో 47 శాతం క్షీణించినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ నివేదిక పేర్కొంది. మొత్తం ఇళ్ల విక్రయాలు 1.38 లక్షలకు పరిమితమైనట్లు వివరించింది.
అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే..