పూర్తిగా నిర్మితమైన స్థిరాస్తి ప్రాజెక్టుల్లో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను స్థిరాస్తి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంపై సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 సంక్షోభ పరిణామాల కారణంగా ప్రస్తుతం స్థిరాస్తి రంగంలో నిధుల కొరత సమస్య నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతినిస్తే.. నిధుల కొరత తీరుతుంది. ఈ రంగం పుంజుకునేందుకు కూడా ఈ పరిణామం దోహదం చేస్తుంది. తద్వారా స్థిరాస్తి అభివృద్ధి సంస్థలకూ ఊరట లభించవచ్చని 'ఎకనమిక్ టైమ్స్' కథనం పేర్కొంది.
పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి
స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థల నుంచి ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణాభివృద్ధి రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంపై పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. కొన్నింటిలో ఇంకా సడలించాల్సి ఉంది. అందులో ఒకటి స్థిరాస్తి రంగం. అందుకే స్థిరాస్తి రంగంలోనూ నిబంధనలను సడలించి, భారత్‌లో సులువుగా పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గనులతో పాటు మరికొన్ని రంగాల్లో సంస్కరణలకు డీపీఐఐటీ యోచిస్తోంది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆటోమేటిక్ పద్ధతిలో 74 శాతం ఎఫ్‌డీఐకి నిబంధనలను సడలించేందుకు కేంద్ర అనుమతిని తీసుకోవాలని డీపీఐఐటీ భావిస్తోంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రభుత్వం ఇప్పటికే పెంచిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ఇంకా కార్యరూపంలోకి తీసుకొని రావాల్సి ఉంది. కేబినెట్ అనుమతులకు సంబంధించి వివరణాత్మక ప్రకటనను త్వరలో డీపీఐఐటీ విడుదల చేయనుంది.