Rakesh Jhunjhunwala on real estate: బ్లూచిప్ స్టాక్‌లతో పోలిస్తే స్థిరాస్తి అభివృద్ధి సంస్థలు తమ పెట్టుబడిపై అతి తక్కువ ప్రతిఫలాన్ని పొందుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వెల్లడించారు. అందుకే ఆయా కంపెనీలను స్టాక్ మార్కెట్లో నమోదు చేయొద్దని సూచించారు. అందుబాటు ధరల్లో లభ్యమయ్యే గృహాల అభివృద్ధిదార్లు మాత్రమే తాము విక్రయించే పరిమాణం ఆధారంగా స్టాక్మార్కెట్లో లిస్టింగ్‌కు ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు. మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్), డీఎల్ఎఫ్ వంటి కొన్ని సంస్థలు మాత్రమే ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడం గమనించొచ్చని తెలిపారు. డీఎల్ఎఫ్ షేరు రూ.1,300 నుంచి రూ.80కి పడిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ రంగంలో నష్టభయాన్ని ఉదహరించారు. 'ఒకవేళ నేనే గనుక డెవలపర్ అయితే నా సంస్థను స్టాక్మార్కెట్లో నమోదు చేయను. ఎందుకంటే ఇది అంత ఆకర్షణీయ వ్యాపారం కాద'ని సీఐఐ నిర్వహించిన స్థిరాస్తి సదస్సులో రాకేశ్ వివరించారు. బ్లూచిప్ స్టాక్‌లు పెట్టుబడిపై 18-25 శాతం ప్రతిఫలం అందిస్తుండగా, స్థిరాస్తి రంగంలో 6-7 శాతమే రాబడి ఉంటోందని తెలిపారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్) అసెట్ క్లాస్‌పై మదుపర్లు బుల్లిష్‌గా ఉన్నారని, ఐటీ సేవలు, ఫార్మా రంగాల మాదిరి ఈ విభాగం కూడా రాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
- 2006లో ఇంటి కొనుగోలు కోసం రాకేశ్ తన పోర్ట్‌ఫోలియోలోని క్రిసిల్ షేర్లను రూ.20 కోట్లకు విక్రయించారు. అప్పట్లో వాటిని విక్రయించకుండా అలాగే ఉంచుకునుంటే, ఇప్పుడు వాటి విలువ రూ.1,000 కోట్లు ఉండేదట.
- టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో తాను జరిపిన సంభాషణను కూడా రాకేశ్ వివరించారు. ఆకాశ ఎయిర్‌తో విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్న తాను రూ.275 కోట్లు పెట్టుబడి పెట్టగా, నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను రూ.18,000 కోట్లు చెల్లించి ఎలా కొనుగోలు చేశారని చంద్రశేఖరన్‌ను అడిగానని రాకేశ్ తెలిపారు.
షేర్మార్కెట్లో మహారాజు ఉండరు
స్టాక్ మార్కెట్‌కు రాజంటూ ఎవరూ ఉండరని ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వ్యాఖ్యానించారు. అలా అనుకున్నవారంతా ఆర్థర్ జైలుకు (ముంబయి కేంద్ర కారాగారం) వెళ్లారని అన్నారు. రాజు ఒకడే అని.. అది మార్కెట్టే అని ఆయన అభిప్రాయపడ్డారు. 'భారత్‌కు సమయం రాబోవడం లేదు.. వచ్చేసింది.' అంటూ ప్రధానికి ఒక ప్రెజెంటేషన్‌ను ఆయన సమర్పించారు. గురువారమిక్కడ జరిగిన సీఐఐ రియల్ ఎస్టేట్ కాన్ఫ్లూయెన్స్ 2022, 4వ ఎడిషన్‌లో ఆయన ఏమన్నారంటే..
'వాతావరణం, మరణం, మార్కెట్, మహిళ.. వీటిని ఎవరూ అంచనా వేయలేరు. మార్కెట్ కూడా మహిళలాంటిదే. ఎపుడూ మనల్ని నిర్దేశిస్తుంది. అనిశ్చితి, ఊగిసలాటకు గురి అవుతుంది. నువ్వెపుడూ ఒక మహిళపై అజమాయిషీ చేయలేవు. అలాగే మార్కెట్‌పై కూడా మనం పైచేయి సాధించలేం.