వివిధ రుణాలపై మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో కేంద్రం రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రుణగ్రహీతలకు మారటోరియం ఫలాలు అందాలంటే వడ్డీ భారం భరించడం తప్ప ఇంకో పరిష్కార మార్గం లేదని ఈ సందర్భంగా కేంద్రం అభిప్రాయపడింది.
మారటోరియం వ్యవధి అయిన మార్చి నుంచి ఆగస్టు వరకు ఈ మాఫీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. రూ.రెండు కోట్ల వరకు ఉన్న రుణాలపై ఈ ఆరు నెలల కాలంలో విధించే వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత, గృహ, విద్య, వాహన, వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది.
అన్ని రకాల రుణాలపై వడ్డీ చెల్లిస్తే కేంద్రంపై రూ.ఆరు లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని.. బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రుణాలు.. అదీ రూ.రెండు కోట్ల వరకు ఉన్న వాటిపై మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
మారటోరియం కాలంలో వాయిదాలు చెల్లించిన వారికి కూడా ఈ ప్రయోజనాన్ని అందిస్తామని చెప్పింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిధుల కేటాయింపు కోసం పార్లమెంటు అనుమతి తీసుకుంటామని పేర్కొంది.