కీలక వడ్డీరేట్లను వరుసగా తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ.. అనూహ్యంగా బ్రేకులు వేసింది. ఇవాళ్టి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మందగమనం, ఆహార పదార్థాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చింది.
ఆర్బీఐ ఈ ఏడాది వరుసగా ఐదుసార్లు కీలక వడ్డీ రేట్లు తగ్గించింది. అయితే ఈసారి మాత్రం రెపోరేటును 5.15 శాతం, రివర్స్ రెపోరేటును 4.90 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా తీర్మానించింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధిరేటు ఆరు సంవత్సరాల కనిష్ఠానికి (4.5 శాతం) పడిపోయింది. ఈ నేపథ్యంలో మందగించిన ఆర్థికవ్యవస్థకు మద్దతుగా కేంద్ర బ్యాంకు ఆరోసారి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందని బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు భావించారు. అయితే ఆర్బీఐ అనూహ్య నిర్ణయంతో అందరూ కంగుతిన్నారు.