RBI on paytm payment bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొత్తగా కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే ఆపేయాలని పేటిఎంను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఐటీ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పేటీఎంకు సూచించింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆర్బీఐకు ఉన్న విశిష్ఠ అధికారాలను ఉపయోగించుకుంటూ కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎం కు ఆర్‌బీఐ ఆదేశించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం ఆర్‌బీఐ మంజూరు చేసే అనుమతులకు లోబడి ఉంటుందని ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 2015లో ఏర్పాటైంది. పేమెంట్స్ బ్యాంక్ నడిపేందుకు ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత 2017 నవంబర్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి.
గతంలో హెచ్‌డీఎఫ్‌సీపై కూడా ఇలాంటి ఆంక్షలనే విధించింది ఆర్‌బీఐ. 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త డిజిటల్ ఉత్పత్తులను లేదా సేవలను ప్రారంభించకూడదని ఆదేశించింది. వినియోగదారులకు రుణాలు ఇవ్వడంలో పునరావృతమయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించే వరకు కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకుండా హెచ్డీఎఫ్సీ పై నిషేధించింది.