ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ లక్ష్యమైన 5.3 శాతానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. డీజిల్, పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఆహార సరఫరా వైపు సమస్యలు తొలగుతాయని, తద్వారా ద్రవ్యోల్బణ నిర్వహణకు ఈ చర్యలు సానుకూలంగా మారాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. దాస్ ఇంకా ఏమన్నారంటే..
అంతర్జాతీయంగా ప్రతికూలతలు..:ద్రవ్యోల్బణం అనేది చాలా వరకు సరఫరా వైపు సమస్యగా ఉంటోంది. ప్రభుత్వ చర్యల వల్ల ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చింది. టోకు ద్రవ్యోల్బణం వైపు ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. వంటనూనెల ధరలు తగ్గడం నుంచి ఆహార ద్రవ్యోల్బణం కిందకు దిగి వస్తోంది. ఆ తర్వాత పప్పు ధాన్యాలు, ఇంధనాలు సహకరించాయి. వచ్చే మార్చి చివరకు ద్రవ్యోల్బణ అంచనా అయిన 5.3 శాతాన్ని సాధించడానికి వీలవుతుంది. ఆ లక్ష్యం నిర్ణయించినప్పుడు పెట్రోలు, డీజిల్ ధరల కోతను పరిగణనలోకి తీసుకోలేదు. ఇపుడు ఆ చర్య మరింత సానుకూలంగా మారింది.