తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ఛార్జీల్లేవ్​.. ఆర్​బీఐ తీపికబురు - నెఫ్ట్​

బ్యాంకు ఖాతాదారులకు డిజిటల్​ చెల్లింపుల్లో ప్రోత్సాహం అందించే విధంగా కేంద్ర బ్యాంకు శుభవార్త చెప్పింది. ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ద్వారా జరిపే లావాదేవీలపై రుసుములను ఎత్తివేసింది.

ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ఛార్జీల్లేవ్​.. ఆర్​బీఐ తీపికబురు

By

Published : Jun 6, 2019, 5:18 PM IST

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రిజర్వ్​ బ్యాంకు ద్రవ్య పరపతి విధాన కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వడ్డీ రేట్లను మరోసారి తగ్గించిన ఆర్​బీఐ.. బ్యాంకు ఖాతాదారులకూ శుభవార్త చెప్పింది. ఆర్​టీజీఎస్​, ఎన్​ఈఎఫ్​టీ లావాదేవీలపై రుసుములను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఎంపీసీ... ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌లపై విధిస్తున్న చార్జీలన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఛార్జీల ఎత్తివేతతో కలిగే ప్రయోజనాలను ఖాతాదారులకు చేరేలా బ్యాంకులే చూడాలని కోరింది ఆర్​బీఐ. దీనిపై వారంలోగా బ్యాంకులకు మార్గనిర్దేశకాలు జారీ చేస్తామని తెలిపింది.

ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ అంటే...

రియల్​ టైం గ్రాస్​ సెటిల్​మెంట్​ సిస్టమ్​(ఆర్​టీజీఎస్​), నేషనల్​ ఎలక్ట్రానిక్​ ఫండ్స్​ ట్రాన్స్​ఫర్​(నెఫ్ట్​) ద్వారా ఆన్​లైన్​ లావాదేవీలు జరపవచ్చు. ఆర్​టీజీఎస్​ నుంచి ఎక్కువ మొత్తంలో తక్షణమే బదిలీ చేయొచ్చు. నెఫ్ట్​తో రూ. 2 లక్షల లోపు లావాదేవీలు చేయొచ్చు.

వీటికి ఛార్జీలను ఆర్​బీఐ బ్యాంకుల నుంచి, బ్యాంకులు ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. డిజిటల్​ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఛార్జీలను ఎత్తివేసింది ఆర్​బీఐ.

ఎస్​బీఐ ఛార్జీలు...

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ.. ప్రస్తుతం నెఫ్ట్​ లావాదేవీలపై రూ. 1 నుంచి 5 వరకు, ఆర్​టీజీఎస్​పై రూ. 5 నుంచి 50 వరకు ఛార్జీలు వసూలు చేస్తోంది.

ఏటీఎం ఛార్జీలపైనా...

ఏటీఎం ఛార్జీలనూ పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. వీటి వినియోగ రుసుములపై సమీక్షించేందుకు భారతీయ బ్యాంకుల సంఘం అధ్యక్షతన.. వాటాదారులందరితో ప్రత్యేక ప్యానెల్​ను ఏర్పాటు చేస్తారు. ఏటీఎం ఛార్జీలపై ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details