స్టాక్ మార్కెట్లను ఈ వారం దేశీయంగా చాలా అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, జులైకు సంబంధించి స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల ఫలితాలు, కరోనా కేసుల వంటివి ఇందులో ప్రధానంగా ఉండనున్నాయి.
రెపో రేటుపై దృష్టి..
కరోనా కారణంగా కీలక వడ్డీ రేట్లను ఇప్పటికే భారీగా తగ్గించింది ఆర్బీఐ. ఈ వారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలు వెలువడనున్నాయి. ఇందులో రెపో రేటుపై తీసుకునే నిర్ణయాలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వడ్డీ రేట్లపై ఎంపీసీ నిర్ణయాలు ఆగస్టు 6న వెలువడనున్నాయి.
ఆర్థిక గణాంకాలు..
ఈ వారమే జులై నెలకు సంబంధించి పలు స్థూల ఆర్థిక గణాంకాలు విడుదల చేయనుంది కేంద్రం. ముఖ్యంగా తయారీ, సేవా రంగాల పీఎంఐ లెక్కలు విడుదల కానున్నాయి. ఈ లెక్కలూ మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
త్రైమాసిక ఫలితాలు..
ఈ వారంలో ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించే కంపెనీల జాబితాలో భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, లుపిన్, టైటాన్, కెనరా బ్యాంక్, ఎం&ఎం ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు పలు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలపై మదుపరులు దృష్టి సారించొచ్చని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.
జులైకు సంబంధించి వాహన విక్రయాల గణాంకాలను.. ఈ వారం నుంచే విడుదల చేయనున్నాయి ఆటో మొబైల్ సంస్థలు. జూన్‌తో పోలిస్తే.. జులైలో విక్రయాలు కాస్త మెరుగైనట్లు వాహన తయారీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే వాహన రంగ షేర్లు సానుకూలంగా స్పందించొచ్చని తెలుస్తోంది.
ఇటు దేశీయంగా, అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, వ్యాక్సిన్‌కు సంబంధించిన వార్తలు, అమెరికా-చైనా మధ్య నెలకొన్న అనిశ్చితులు కూడా మార్కెట్లకు కీలకమనే విశ్లేషణలు వస్తున్నాయి.
రూపాయి, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణం అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:యాపిల్ ఐ స్టోర్ నుంచి 29,800 యాప్‌లు డిలీట్!