RBI new Rule on Online Card Transactions: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ పోర్టళ్లలో గానీ.. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లో గానీ ఇప్పటి వరకు మనం ఒకసారి కార్డు వివరాలు ఎంటర్ చేస్తే మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఇకపై అలా కుదరదు. జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏదైనా లావాదేవీ జరపాలంటే మీ క్రెడిట్/డెబిట్ కార్డుపై ఉన్న వివరాలన్నీ ఎంటర్ చేయాల్సిందే. అలాకాకుండా మునుపటిలా సులువుగా మీ లావాదేవీ పూర్తి చేయాలంటే మీ కార్డును టోకనైజ్ చేయాలి. ఇంతకీ ఏంటీ టోకనైజేషన్? ఎలా చేయాలి?
Rbi New Rules 2021: ఇ-కామర్స్ వేదికల్లో ఒకసారి మనం కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే భవిష్యత్ కొనుగోళ్ల కోసం ఆ కార్డు వివరాలను సదరు ఇ-కామర్స్ వేదికలు సేవ్ చేసుకునేవి. అయితే, వినియోగదారుల భద్రత కోసం ఆర్‌బీఐ నిబంధనలను మార్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అంటే ఆయా వేదికలేవీ ఇకపై కార్డు వివరాలను భద్రపరచకూడదు. కేవలం వినియోగదారుడు టోకనైజేషన్‌కు అనుమతిస్తేనే సేవ్ చేయాలి. ఆ వివరాలు ప్రత్యేకమైన ఆల్గారిథమ్‌తో రూపొందించిన కోడ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. ఇలా టోకనైజ్ చేయడం వల్ల భవిష్యత్ కొనుగోళ్ల సమయంలో కార్డులోని చివరి నాలుగు అంకెలు వినియోగదారుడికి మాత్రమే కనిపిస్తాయి.