రుణ వాయిదాల చెల్లింపులపై వినియోగదారులకు ఆర్బీఐ ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది కేంద్రం. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందుకే రుణ వాయిదాలు, ఇతర చెల్లింపులను ఆలస్యమైనా బ్యాంకులు అనుమతించేలా ఆర్బీఐ ఆదేశాలిచ్చే ఆవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
'లాక్‌డౌన్ కారణంగా వ్యాపారులు, ఇతర వ్యక్తుల ఆదాయ మార్గాలకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా రుణాలు, నెలవారీ వాయిదాలు ఆలస్యమైనా చెల్లింపునకు అనుమతివ్వాలనే డిమాండు ఇటీవల పెరిగిపోయింది. ఇప్పటికే ఈ అంశంపై భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) చర్చలు జరిపింది. ప్రస్తుతం ఈ అంశం పరిశీలనలో ఉంది.' అని ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు.
అర్బీఐ ఇందుకు అంగీకరిస్తే ప్రస్తుతం సంక్షోభ సమయంలో వ్యాపార, వ్యక్తి గత రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుంది.