రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఊరట కల్పించింది. ఆటోమేటిక్ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది.
ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులకు వినియోగదారుల నుంచి అదనపు ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 31 తర్వాత ఏఎఫ్‌ఏ(అడిషినల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్)కు లోబడకుండా కార్డులు, ప్రీపెయిడ్ పేమెంట్ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తున్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్‌ఆర్‌బీలు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్ గేట్‌వేలతో పాటు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ గతేడాది డిసెంబరు 4న ఆదేశించింది. కార్డు లావాదేవీల భద్రత, రక్షణ బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్‌బీఐ గతంలో తెలిపింది.