కరోనా కాలంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా, వ్యాక్సిన్ తయారీదారులు, ఆస్పత్రులకు ఊతం అందించేలా భారతీయ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్న రుణగ్రహీతలు అప్పులు చెల్లించేందుకు మరింత సమయం ఇచ్చింది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు టీకా తయారీదారులు, ఆస్పత్రులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు వెసులుబాటు కల్పించింది.
రెండేళ్ల ఊరట..
రూ.25 కోట్ల వరకు రుణం తీసుకున్నవారు ఆ అప్పును తిరిగి చెల్లించే సమయాన్ని రెండేళ్ల మేర పెంచింది ఆర్బీఐ. 2020లో రుణ పునర్వ్యవస్థీకరణకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికే తాజా నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఆర్బీఐ నిర్ణయంతో మొత్తం రుణగ్రహీతల్లో 90శాతం మందికి రుణవ్యవస్థీకరణకు అవకాశం లభిస్తుందని భారతీయ బ్యాంకుల సంఘం తెలిపింది.
వైద్య రంగానికి ఊతం..
వైద్య రంగానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు రూ.50వేల కోట్ల మేర ద్రవ్యసాయం చేస్తామని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ నిధుల నుంచి టీకా తయారీదారులు, ఆస్పత్రులు, ఇతర వైద్య రంగ సంబంధిత సంస్థలకు రెపో రేటుపై మూడేళ్ల కాలవ్యవధితో రుణాలు ఇవ్వొచ్చని వివరించింది.