కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం బ్యాలెన్స్ షీట్, అసెట్ క్వాలిటీ, లిక్విడిటీపై ఎంత మేర ఉందో అంచనా వేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కోరింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, పేమెంట్ బ్యాంకులు సమన్వయ వ్యూహం అనుసరించాల్సిన అవసరముందని పేర్కొంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేపట్టాల్సిన చర్యలపై ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. తమ ఖాతాదారులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
"ఆర్థిక మార్కెట్లు, సంస్థలు పుంజుకునేందుకు గత కొద్ది రోజులుగా ఆర్బీఐ తగు చర్యలు తీసుకుంటోంది. భారతీయ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ పలు పాలసీ విధానాలను అవలంబిస్తోంది. అసరమైన పాలసీ విధానాలను సమయానుగుణంగా వినియోగిస్తాం. "
- శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్