Digital Payments: ఇంటర్నెట్ లేకున్నా (ఆఫ్‌లైన్) డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలని నిర్ణయించిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అందుకు సంబంధించి విధివిధానాలను సోమవారం విడుదల చేసింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ.2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో, ఈ పథకాన్ని ఆర్‌బీఐ అమల్లోకి తెస్తోంది.
Digital Payments: ఇంటర్నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు - డిజిటల్ చెల్లింపులు
ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి విధివిధానాలను విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). ఒక లావాదేవీకి రూ.200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ.2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది.
కొన్నిసార్లు నెట్‌వర్క్ సరిగా లేకపోతే డిజిటల్ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఒక్కోసారి ఖాతాదారు బ్యాంకు ఖాతాలో నగదు డెబిట్ అయినా.. వ్యాపారికి చేరడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా అసలు ఇంటర్నెట్ లేకున్నా.. ఆఫ్‌లైన్ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరిపే పద్ధతిని ఆర్‌బీఐ ఆవిష్కరించింది. కొన్ని ప్రాంతాల్లో 2020 సెప్టెంబరు నుంచి 2021 జూన్ వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. తదుపరి ఒక్కో లావాదేవీకి రూ.200 మించకుండా, మొత్తం విలువ రూ.2,000 వరకు (బ్యాంకులో నిల్వను బట్టి) చెల్లింపు అనుమతిస్తూ విధివిధానాలను రూపొందించింది. ఈ ఆఫ్‌లైన్ లావాదేవీలను కార్డులు, వాలెట్లు, మొబైల్‌లు తదితరాలతో చేసేందుకు వీలుంది. ఈ లావాదేవీల్లో ఏర్పడే వివాదాలూ అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
- ఈ ఆఫ్‌లైన్ చెల్లింపులు కచ్చితంగా సంబంధిత వ్యక్తులు ప్రత్యక్షంగా (ఫేస్-టు-ఫేస్) చేయాలి. వీటికి అదనపు భద్రతా ధ్రువీకరణ అవసరం లేదు. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రం ద్వారా ఈ చెల్లింపులు జరిపేందుకు వీలవుతుంది. అప్పటికప్పుడు దీనికి నెట్‌తో పని ఉండదు. రోజువారీ లావాదేవీలన్నీ పూర్తయ్యాక, వ్యాపారి ఈ యంత్రాన్ని నెట్‌కు అనుసంధానిస్తే ఆయా చెల్లింపులన్నీ ఒకేసారి ప్రాసెస్ అవుతాయి. వాయిస్ బేస్డ్ చెల్లింపులూ, ఐవీఆర్ ద్వారా సూచనలు ఇచ్చి, చెల్లింపులను పూర్తి చేయొచ్చు. పేమెంట్ సిస్టం ఆపరేటర్లు, పేమెంట్ సిస్టం పార్టిసిపెంట్లు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు) ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆర్‌బీఐ సూచించింది.
ఇదీ చూడండి:ఈ త్రైమాసికంలో 24 సంస్థలు పబ్లిక్ ఇష్యూకు సిద్ధం!