తెలంగాణ

telangana

ETV Bharat / business

రాఖీ కట్టే సోదరికి ఈ ఆర్థిక బహుమతులు ఇవ్వండి

తోబుట్టువుల అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ వచ్చేస్తోంది. రాఖీ కట్టిన సోదరికి బహుమతి ఇవ్వడం సాధారణమే. అయితే ఈసారి డబ్బులు కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నించండి. సోదరికి ఉపయోగపడే విధంగా ఆర్థిక సాధనాలను ఉపయోగించుకోండి. ఎలాంటి ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వాలనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

ratg-hyd-50-31-attn-etvbharat-rakhi-festival-financial-gifts-for-sisters
రాఖీ కట్టే సోదరికి ఈ ఆర్థిక బహుమతులు ఇవ్వండి

By

Published : Aug 1, 2020, 3:45 PM IST

రాఖీ పండుగకు సోదరికి ఏ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా...! ఈ ప్రత్యేకమైన రోజున భౌతికంగా కనిపించే బహుమతుల బదులు ప్రత్యేకంగా ఉండేలా సోదరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా బహుమతిని అందించండి.

వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అప్పుడే ఉద్యోగాల్లో చేరుతున్న వారికైతే ఇది చాలా ముఖ్యం. ఆర్థిక విజ్ఞానం పెంపొందించేందుకు కావాల్సిన పుస్తకాలను సోదరికి అందించవచ్చు. మనీ మేనేజ్‌మెంట్​‌కు సంబంధించి మార్కెట్‌లో బోర్డ్‌ గేమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా ఇవ్వొచ్చు. సోదరికి భవిష్యత్తులో ఆర్థిక విజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. వీటితో పాటు కింది వాటిని ఈ రాఖీకి చెల్లె, అక్కలకు అందించవచ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్

సోదరికి బ్యాంకు ఖాతా లేనట్లయితే అకౌంట్ తెరిపించండి. దానికి కావాల్సిన మినిమం బ్యాలెన్స్‌ మీరు చెల్లించవచ్చు. దీనికి ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు మహిళలకు ప్రత్యేకించి అకౌంట్లను అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో ఖాతా తెరుస్తున్నట్లయితే సోదరి కూడా మీతో ఉండాలి. ఖాతా ఉన్నట్లయితే సోదరి పేరు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేందుకు ప్రయత్నించవచ్చు. సేవింగ్స్‌ ఖాతా కంటే ఎఫ్‌డీలో ఎక్కువ రిటర్న్స్‌ ఉంటాయి.

మ్యూచవల్‌ ఫండ్లు...

ఒకవేళ సోదరి వయస్సు తక్కువగానే ఉన్నట్లయితే… ఈక్విటీలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించండి. పరోక్షంగా ఈక్విటీ పెట్టుబడులు కోసం మ్యూచువల్‌ ఫండ్లను ఉపయోగించుకోవచ్చు. ప్రత్యక్షంగా అయితే డీమ్యాట్‌ ఉండాలి. సేవింగ్స్‌, ట్రేడింగ్‌, డీమ్యాట్‌ అందించే త్రీ-ఇన్‌-వన్‌ ఖాతాలను కూడా దీనికి సంబంధించి తెరవచ్చు. ఈ రోజుల్లో చాలా సంస్థలు ఈ తరహా అకౌంట్‌ను ఇస్తున్నాయి.

బంగారం

బంగారాన్ని భౌతికంగా కొనుగోలు చేయటం కంటే డిజిటల్‌ పద్ధతుల్లో మీ సోదరికి అందించవచ్చు. బంగారంపై పెట్టుబడుల వల్ల ఆదాయం రావటమే కాకుండా, ఆర్థికంగా సమస్యల్లో ఉన్నప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. బంగారాన్ని భౌతికంగా కొనుగోలు చేసినట్లైతే పలు రకాల ఛార్జీల వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల, బంగారం ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ రూపంలో పెట్టుబడి పెట్టాలి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల కొనుగోలు చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి.

ఆరోగ్య బీమా..

ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి అవసరం. ఆధునిక యుగంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో భారీ ఖర్చు అవుతుంది. ఈ భారం మీ సోదరిపై పడకుండా పాలసీ ఉపయోగపడుతుంది. ప్రస్తుత కరోనా మహమ్మారి దృష్ట్యా సరైన ఆరోగ్య బీమా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. మీరు సోదరి పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఆరోగ్య బీమా తీసుకోవాలంటే ధ్రువీకరణ పత్రాలు కావాలి.

గిఫ్ట్‌ కార్డులు

చాలా సంస్థలు గిఫ్ట్ కార్డులను అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎస్‌బీఐ, యాక్సిస్‌ వంటి పలు బ్యాంకులు.. అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్ లాంటి చాలా ఈ-కామర్స్‌ కంపెనీలు ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ కార్డులను అందిస్తున్నాయి. రూ.500 విలువ నుంచి ఈ గిఫ్ట్‌ కార్డు తీసుకోవచ్చు. వీటిని కూడా బహుమతిగా అందించవచ్చు. మీ సోదరి తనకు ఇష్టమైన వాటిని దీని ద్వారా కొనుక్కోవచ్చు.

రుణ వాయిదా చెల్లించటం

రుణాన్ని చెల్లించటం ద్వారా మీ సోదరి మీద భారం తగ్గుతుంది. తద్వారా పొదుపు, పెట్టుబడి చేసేందుకు మీ సోదరి వద్ద ఎక్కువ మొత్తం ఉంటుంది. అంతే కాకుండా రుణాలకు సంబంధించి పునర్‌వ్యవస్థీకరించేందుకు మీ సోదరికి మంచి సలహా ఇవ్వవచ్చు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించేందుకు అయ్యే మొత్తాన్ని అందించవచ్చు.

ఇదీ చదవండి:'ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుందని నమ్ముతున్నా'

ABOUT THE AUTHOR

...view details