రైల్వేలో ఒప్పంద కార్మికులకు కనీస వేతనాల హామీ అమలుకు ఏర్పాటు చేసిన పోర్టల్ సహకారంతో రెండేళ్లలో రూ.3,459 కోట్ల వేతనాలు చెల్లించినట్లు రైల్వేశాఖ గురువారం తెలిపింది.
2018 అక్టోబరు 1న 'శ్రామిక్ కల్యాణ్' పేరిట ఈ-అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది రైల్వే. దీని ద్వారా గుత్తేదారులు కనీస వేతన చట్టం నిబంధనలను పాటిస్తూ రోజువారి ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు ఎంత చెల్లిస్తున్నారో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒప్పంద కార్మికులకు జరుగుతున్న చెల్లింపులపై నిఘా వేయడానికి ఈ పోర్టల్ దోహదపడుతున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2021 మార్చి 9 నాటికి ఇందులో 15,812 మంది గుత్తే దారులు, 3,81,881 మంది ఒప్పంద కార్మికులు రిజిస్టర్ అయినట్లు తెలిపింది.