ప్రయాణికుల రైళ్ల ప్రైవేటీకరణ కోసం రైల్వేశాఖ బుధవారం నిర్వహించిన రెండో రౌండ్ ప్రీబిడ్ మీటింగ్‌లో 23 సంస్థలు పాల్గొన్నాయి. జులై 21న నిర్వహించిన తొలి ప్రిబిడ్ మీటింగ్‌లో 16 సంస్థలు పాల్గొనగా ఇప్పుడు ఆ సంఖ్య 23కి చేరింది. ఇదే ఆఖరి ప్రిబిడ్ మీటింగ్. సెప్టెంబరు 8న ప్రైవేటు సంస్థల నుంచి రైల్వేశాఖ అంతిమ బిడ్లు పిలవనుంది.
2023 ఏప్రిల్ నుంచి తొలిదశ ప్రైవేటు రైళ్లు నడపాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 151 రైళ్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించి, రూ.30వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని నిర్ణయించింది. దీనివల్ల రైల్వేలోకి కొత్త సాంకేతిక పరిజ్ఞానం రావడంతో పాటు, ఆదాయాలు, ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నది అంచనా. ఈ రంగంలోకి భిన్న ప్రైవేటు సంస్థలు రావడంవల్ల పోటీ పెరిగి, సేవల నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా ఇవి నడపాలన్నది నిర్ణయం.
ఇవన్నీ హాజరు
బుధవారం జరిగిన రెండో ప్రిబిడ్ మీటింగ్‌లో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిలెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మేధా ఇంజనీరింగ్, స్టెరిలైట్‌పవర్, భారత్ ఫోర్జ్, ఐ-బోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీఏఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐఆర్‌సీటీసీ లిమిటెడ్, భెల్, ఆల్‌స్తోమ్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియా లిమిటెడ్, హింద్ రెక్టిఫయ్యర్స్ లిమిటెడ్, జేకేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బొంబాడియర్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియా, తితాగర్ వ్యాగన్స్ లిమిటెడ్, గేట్‌వే రైల్, జసన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌లిమిటెడ్, ఆర్‌కే అసోసియేట్స్ అండ్ హోటిలియర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్‌జీజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఈఎంఎల్, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఇస్క్ ఏసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, సీమెన్స్ లిమిటెడ్ సంస్థలున్నాయి.
2027 నాటికి 151 రైళ్లు
ప్రైవేటీకరణ లక్ష్యాన్ని దశలవారీగా పూర్తిచేసి 2027నాటికి 151 రైళ్లను ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహించాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 2021 ఏప్రిల్ నాటికి ప్రైవేటు సంస్థల ఎంపిక పూర్తిచేస్తారు. 2023-24 నాటికి 12 రైళ్లు, 2024-25 నాటికి మరో 45 రైళ్లు, 2025-26 నాటికి మరో 50 రైళ్లు, 2026-27 నాటికి మిగిలిన 44 రైళ్లు ప్రైవేటు ఆధ్వర్యంలో నడపాలన్నది ప్రస్తుతం ఉన్న ప్రతిపాదన. ఈ రైళ్లను 12 క్లస్టర్లుగా విభజిస్తారు. దిల్లీ, ముంబయిల్లో రెండు క్లస్టర్లు, సికింద్రాబాద్, చెన్నై, హౌరా, జైపూర్, ప్రయాగ్‌రాజ్, చండీగఢ్, బెంగళూరు, పట్నాల్లో ఒక్కో క్లస్టర్లు ఏర్పాటుచేస్తారు. ఈ ప్రైవేటీకరణ ద్వారా వచ్చే కొత్త రైళ్లలో 70% దేశీయంగానే తయారవుతాయన్నది రైల్వేశాఖ అంచనా. వాటికవసరమయ్యే ఆర్థిక వనరులు, నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేటు వారిదే. 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో నడిచేలా ఈ రైళ్లను డిజైన్ చేస్తారు. రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 10-15%, 160 కిలోమీటర్ల వేగంతో సాగితే 30% ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నది అంచనా. తొలినాళ్లలో 130 కిలోమీటర్లతో నడిపి తదనంతరం 160 కిలోమీటర్ల వేగంతో నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 151 రైళ్ల ద్వారా యేటా రూ.3వేల కోట్ల ఆదాయం రైల్వేశాఖకు వస్తుందని అంచనా. ఈ ప్రైవేటు ఆపరేటర్లను రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌క్యూ), ర్విక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) పద్ధతిలో ఎంపికచేస్తారు.
ఇదీ చదవండి-'పారదర్శక పన్ను విధానం' వేదికను ప్రారంభించనున్న మోదీ