తెలంగాణ

telangana

ETV Bharat / business

చేతక్​ టు పల్సర్​... హమారా 'బజాజ్​'కు సారథి​ ఆయనే - chatak designer rahul bajaj history

స్వదేశీ అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పినవాడు.. విదేశీ విసిరిన సవాల్‌కు జవాబు చెబుతున్నవాడు.. ఈక్రమంలో ప్రభుత్వాలతో సైతం ఎదురొడ్డినవాడు.. ప్రత్యక్ష రాజకీయాలతో పెద్దగా సంబంధం లేకపోయినా.. సమకాలీన పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశించడానికి ఏమాత్రం వెనకాడని వాడు.. సాధారణ జనాల్లో ‘హమారా బజాజ్‌’గా ప్రసిద్ధి చెందిన వాడు.. ఆయనే బజాజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌. ఆయన గరించి తెలుసుకుందాం.

rahul bajaj
నాటి చేతక్‌.. నేటి పల్సర్‌.. ఈయన కృషే..!

By

Published : Dec 8, 2019, 4:43 PM IST

మన రోడ్లు, మన అవసరాలు, మన కొనుగోలు శక్తిని చూసి స్వదేశీ సాంకేతికతతో స్కూటర్లను ఆవిష్కరించి వాహన రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించారు. మధ్యతరగతి ప్రజల అవసరాల కోసం దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేసిన నవతరం పారిశ్రామిక వేత్త రాహుల్‌ బజాజ్‌.సాధారణంగా ప్రభుత్వ విధానాలు, రాజకీయాలపై స్పందించడానికి పారిశ్రామికవేత్తలు ఇష్టపడరు. కానీ ఆయన మాత్రం అందుకు భిన్నం. ‘ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్ని నాయకులు స్వీకరించే వాతావరణం లేదని ప్రజలు భావిస్తున్నారు’ అంటూ కేంద్ర హోంమంత్రిని సూటిగా ప్రశ్నించి వార్తల్లో నిలిచారు రాహుల్‌ బజాజ్‌.

జమ్నాలాల్‌ బజాజ్‌.. గాంధీకి ఐదో కొడుకు...

బజాజ్‌ కంపెనీ ప్రస్థానం రాహుల్‌ బజాజ్‌ తాత జమ్నాలాల్‌ బజాజ్‌తో ప్రారంభమైంది. స్వాతంత్ర్య ఉద్యమంలో జమ్నాలాల్‌ ప్రముఖ పాత్ర పోషించారు. గాంధీ ఆయన్ని తన ఐదో కుమారుడిగా చెప్పుకునేవారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా అనేక సార్లు జైలుకు కూడా వెళ్లారు. గాంధీకి తోడుగా నడుస్తూ.. దేశ పారిశ్రామిక రంగ వృద్ధిలో భాగం కావాలన్న ఆకాంక్షతో 1926లో మొట్టమొదట రాజస్థాన్‌లో చక్కెర కర్మాగారాన్ని నెలకొల్పారు. కానీ, స్వాతంత్ర్య సంగ్రామంలో తీరిక లేకుండా ఉన్న ఆయన వ్యాపారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు.
దీంతో వ్యాపార బాధ్యతల్ని ఆయన తనయుడు కమల్‌నయన్‌ బజాజ్‌కు 1942లో అప్పగించారు. ఆయన కూడా గాంధీ, నెహ్రూ కుటుంబాలకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కమల్‌నయన్‌ వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. అందులో భాగంగా 1940లో దేశ వాహనరంగ గతిని మార్చిన బజాజ్‌ ఆటోను ప్రారంభించారు.

హార్వర్డ్‌లో విద్యాభ్యాసం...

సంపదను సృష్టించి అది పలువురికి ఉపయోగపడేలా చేయాలన్న తలంపు ఉన్న కుటుంబంలో రాహుల్‌ బజాజ్‌ 1938, జూన్ 10న జన్మించారు. వ్యాపారరీత్య వార్దా, పుణె, ముంబయిలకు నివాసాలను మార్చారు. ముంబయిలోని కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. 1964లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే పూర్తి చేశారు. ఆ సమయంలోనే రూపా బజాజ్‌తో వివాహం జరిగింది.

తక్కువ కాలంలోనే వ్యాపారంపై పట్టు...

ఎంబీయేలో చేరడానికి ముందే కంపెనీలో నాలుగేళ్ల పాటు చిన్న స్థాయి ఉద్యోగులతో కలిసి పనిచేశారు. అలా అనుభవం గడించిన తర్వాత హార్వర్డ్‌లో అంతర్జాతీయ పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. 1965లో కంపెనీ బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ బజాజ్‌ తక్కువ కాలంలోనే కంపెనీపై పట్టు సాధించారు. 1968కల్లా ఛైర్మన్‌ అయ్యారు. రాహుల్‌ రాకతో బజాజ్‌ నిజమైన ప్రస్థానం ప్రారంభమైంది. ధీరూభాయ్‌, ఆదిత్య బిర్లాతో సన్నిహితంగా ఉన్న రాహుల్‌ కంపెనీ ఎదుగుదలకు అష్టకష్టాలు పడ్డారు. తొలుత విదేశాల నుంచి విడి భాగాలను తెచ్చి అమ్మిన బజాజ్‌ తరువాత సొంతంగానే ద్విచక్రవాహనాలను తయారుచేసింది.

ప్రభుత్వాన్ని ఎదురొడ్డి...

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు బజాజ్‌కు ప్రభుత్వ నిబంధనలు అడ్డుగోడలుగా మారాయి. ఇందిరాగాంధీ ప్రధాని కావడాన్ని ఓ దశలో రాహుల్‌ తండ్రి కమల్‌నయన్‌ వ్యతిరేకించారు. లైసెన్స్‌రాజ్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలో ఎమర్జేన్సీ సమయంలో బజాజ్‌ కంపెనీపై ఐటీ అధికారులు ముప్పేట దాడి చేశారు. ఈ ఘటన రాహుల్‌ బజాజ్‌ను కలచివేసింది. మూడు రోజుల పాటు సాగిన దాడుల్లో ఏమీ దొరకకపోవడంతో అధికారులు చివరకు తోకముడిచారు.

అనంతరం వచ్చిన ప్రభుత్వం.. కంపెనీ విస్తరణకు రాహుల్‌ పెట్టుకున్న దరఖాస్తుకు మోక్షం కల్పించింది. అలా ఔరంగాబాద్‌ సమీపంలో మూడు లక్షల సామర్థ్యంతో తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. రికార్డు స్థాయిలో దాన్ని 14 నెలల్లోనే పూర్తి చేశారు. కంపెనీ విస్తరణకు అనుమతులు నిరాకరించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. క్రమేణా ఇలాంటి అవస్థలు తొలగిపోవడంతో కంపెనీని విస్తరించి ప్రపంచంలో అతిపెద్ద రెండో ద్విచక్రవాహన తయారీ సంస్థగా అప్పట్లో నిలిపారు. పీవీ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్ని రాహుల్‌ స్వాగతించి ప్రభుత్వానికి అండగా నిలిచారు. కానీ, ఆ వెంటనే బహుళజాతి విదేశీ కంపెనీలకు ఎర్రతిచాచీ పరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

లైసెన్స్‌రాజ్‌తో తమని దశాబ్దాలపాటు వేధించిన ప్రభుత్వాలు ఇప్పుడు మళ్లీ విదేశీ కంపెనీల పోటీతో కుంగదీస్తున్నారని బహిరంగంగానే విమర్శించారు. దీనికి వ్యాపార వర్గాల, ప్రజల మద్దతు కూడా లభించడంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. అప్పటి వ్యాపార, వాణిజ్య సంఘాలైన అసోచామ్‌, ఫిక్కీలకు దీటుగా సీఐఐని తెరపైకి తెచ్చిన ఘనత రాహుల్‌ బజాజ్‌కే దక్కుతుంది. చాలా తక్కువ వ్యవధిలోనే సీఐఐ ఒక ప్రధాన వ్యాపార వాణిజ్యవేత్తల సంఘంగా తయారైంది. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా స్వదేశీ సంస్థలు కూడా మారేలా పరిస్థితులు ఏర్పడ్డాయి.

మధ్యతరగతి ప్రజల ప్రియ నేస్తం చేతక్‌...

బజాజ్‌ చేతక్‌ ద్విచక్ర వాహనాల చరిత్రను తిరగరాసింది. స్వల్పకాలంలో ద్విచక్రవాహనానికి పర్యాయపదంగా మారింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు స్కూటర్‌ అంటే బజాజ్‌ చేతకేనని మధ్యతరగతి ప్రజలతో మమేకమయ్యింది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలు కూడా జరిగేవంటే వీటికి అప్పట్లో ఉన్న డిమాండ్‌ ఏంటో తెలుసుకోవచ్చు. ఆరోజుల్లో బజాజ్‌ స్కూటర్‌ని బహుమతిగా అడగని పెళ్లికొడుకు లేడంటే అతిశయోక్తి కాదు. ఆర్డర్‌ చేసిన తరవాత స్కూటర్‌ కోసం ఒక్కోసారి 10ఏళ్ల పాటు వేచిచూడాల్సి వచ్చేది. అయితే స్కూటర్‌ తర్వాత వచ్చిన మోటార్‌సైకిళ్ల తయారీలో మాత్రం తొలినాళ్లలో బజాజ్ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది.

ప్రజలు ఒక్కసారిగా స్కూటర్‌ నుంచి మోటార్‌ సైకిల్‌కి మారతారని అంచనా వేయలేకపోయింది. ఈ తరుణంలో హోండా నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. కానీ, తన పూర్వీకుల స్వదేశీ సిద్ధాంతాన్ని నిలబెడతానని సవాల్‌ చేశారు రాహుల్‌. అప్పటికే అందివచ్చిన కొడుకు రాజీవ్‌ను రంగంలోకి దింపారు. అలా బజాజ్ కంపెనీ స్కూటర్‌ మార్కెట్‌ను పక్కనబెట్టి మోటార్‌సైకిల్‌ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఏ స్కూటర్‌కైతే ప్రాణం పోసిందో అదే షెడ్ నుంచి బైక్‌లు రావడం మొదలైంది. బాలరిష్టాలను అధిగమించిన బజాజ్‌ ఆటో ప్రస్థానం.. నేడు మధ్యతరగతి యువకుల నేస్తంగా మారిన పల్సర్‌ వరకు చేరింది. అలా చేతక్ మొదులపెట్టిన వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.

1962లో కేవలం 3,995 స్కూటర్లను తయారు చేసిన కంపెనీ నేడు నెలకు లక్షల్లో ద్విచక్రవాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలో నెమ్మదిగా విదేశాలకు సైతం తమ ఎగుమతుల్ని ప్రారంభించారు. దాదాపు 50దేశాల రోడ్లపై బజాజ్‌ బ్రాండ్‌ తిరుగుతోంది. ఇండోనేషియాలో బజాజ్‌ నుంచి వచ్చిన మూడుచక్రాల ఆటో రిక్షాలు లేని పట్టణం లేదంటే అతిశయోక్తి కాదు.

కంపెనీ ప్రాంగణంలోనే నివాసం...

వేలకోట్ల కంపెనీకి అధిపతి అయినా ఆయన ఏనాడూ తన వ్యవహారశైలి మార్చుకోలేదు. చాలా సాదాసీదాగానే ఉంటారు. వేషధారణలోగానీ, జీవనవిధానంలోగానీ మార్పు లేదు. తోటి పారిశ్రామికవేత్తలంతా ప్రముఖులు ఉండే కాలనీల్లో ఉంటుండగా.. రాహుల్‌ మాత్రం పుణెలోని కంపెనీ ప్లాంట్లో ఇళ్లు కట్టుకొని అదే లోకంగా జీవిస్తున్నారు. పాత హిందీ సినిమాలు, పాటలంటే ఆయనకు చాలా ఇష్టం. సంఘసేవా కార్యక్రమాలు, ధార్మిక పనుల్లో పాల్గొంటారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో గాంధీజీ వార్దా వస్తే బజాజ్‌ ఇంట్లోనే బసచేసేవారు.

ఇప్పటికీ మహాత్ముడి సిద్ధాంతాల్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ విలువలను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్ల లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. జమ్నాలాల్‌ బజాజ్‌ పేరిట ఏటా నాలుగు అవార్డులు ఇస్తున్నారు. ఔరంగాబాద్‌లో ఆసుపత్రిని నెలకొల్పి పేదలకు వైద్యసేవలందిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి. సాధించాల్సింది ఇంకా చాలా ఉందంటారాయన.. బజాజ్‌ పయనం సుదీర్ఘమైనదని.. అది నిరంతరం కొనసాగుతూనే ఉందంటారు.

స్వదేశీ సాంకేతికత ఎంత గొప్పదో రాహుల్‌ బజాజ్ నిరూపించారు. విదేశీ కంపెనీలతో ఎలా పోటీపడగలమో చేతల్లో చూపుతున్నారు. ఆర్భాటాలకు దూరంగా తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో చూపుతున్నారు. భావితరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. అవసరమైతే ప్రభుత్వాలకు ఎదురొడ్డి దేశ పరిశ్రమలను కూడా కాపాడారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రజలు ఏమంత సంతోషంగా లేరన్నది ఆయన అభిప్రాయం. రైతులు, కార్మికులు, సైనికులు, పారిశ్రామికవేత్తలు ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే నేను భారతీయుణ్ని అని గర్వించే స్థాయికి ఎదగాలన్నది ఆయన ఆకాంక్ష. ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందితే.. సహజంగా ఇతర రంగాల్లో ముందుకు దూసుకెళ్తామన్నది ఆయన బలమైన విశ్వాసం. సైనిక బలం కంటే ఆర్థిక బలమే దేశానికి, ప్రజలకు స్వయం సమృద్ధి సాధించిపెడుతుందని నమ్ముతారు.

ఇదీ చూడండి : దిల్లీ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details