తెలంగాణ

telangana

ETV Bharat / business

పబ్లిక్ క్లౌడ్​తో.. 100 బిలియన్​ డాలర్లు, 2.4 లక్షల ఉద్యోగాలు!

భారత్​లో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ అమలు గురించి గూగుల్​ క్లౌడ్​-బీసీజీ ఉమ్మడి నివేదిక ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల 2023 నాటికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం, 2.4 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది.. అయితే భారత ప్రభుత్వ నిబంధనలు పబ్లిక్ క్లౌడ్ వినియోగించడంలో పలు సంక్లిష్టతలకు కారణమవుతున్నాయని పేర్కొంది.

Google Cloud-BCG joint report
పబ్లిక్ క్లౌడ్​తో 2.4 లక్షల ఉద్యోగాలు!

By

Published : Feb 7, 2020, 1:15 PM IST

Updated : Feb 29, 2020, 12:44 PM IST

పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను అమలుచేయడం వల్ల 2023 నాటికి భారత ఆర్థికవ్యవస్థకు సుమారు 100 బిలియన్​ డాలర్ల మేర ఆదాయం సమకూరుతుందని ఓ నివేదిక తెలిపింది. అలాగే ప్రత్యక్షంగా 2.4 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 7,43,000 ఉద్యోగాలు కూడా కల్పించవచ్చని పేర్కొంది.

"భారత్​లో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థకు 2023 నాటికి సుమారు 100 బిలియన్​ డాలర్ల మేర ఆదాయం అందించే సామర్థ్యం ఉంది. వార్షికంగా, ఇది జీడీపీలో 0.6 శాతం."- గూగుల్​ క్లౌడ్​-బీసీజీ ఉమ్మడి నివేదిక

ఈ 2,40,000 ప్రత్యక్ష ఉద్యోగాల్లో 1,57,000 మంది డేటా సైంటిస్టులు, ఉత్పత్తి నిర్వాహకులు, ఇంజినీరింగ్, డిజైన్​, యూజర్ ఎక్స్​పీరియన్స్ అండ్ క్లౌడ్​ సర్వీస్ ప్రొవైడర్లు, ఐటీ సర్వీస్ ప్రొవైడర్లుగా ఉంటారని నివేదిక పేర్కొంది. అలాగే మౌలిక సదుపాయాల నిర్వహణలో ఉద్యోగాలు, డిజిటల్, టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. మరో 83 వేల ఉద్యోగాలు ప్రధాన వ్యాపార స్రవంతికి చెందినవని వెల్లడించింది.

సంక్లిష్టత వల్లే..!

లెగసీ డేటా భద్రత విషయంలో ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, ఫలితంగా క్లౌడ్​లో ఆ డేటాను పొందుపరచడానికి వీలుకావడం లేదని, వ్యవస్థ సంక్లిష్టంగా ఉందని నివేదిక తెలిపింది. అయితే ఇప్పుడిప్పుడే ఆర్థికసంస్థలు, తయారీదారులు క్లౌడ్ కంప్యూటింగ్​కు మరలడం ప్రారంభమైందని స్పష్టం చేసింది.

పబ్లిక్ క్లౌడ్ వైపు...​

"సంప్రదాయ చిల్లర వ్యాపారులు ఇప్పుడిప్పుడే ఈ కామర్స్ వైపు మళ్లుతున్నారు. దీపావళి లాంటి ప్రత్యేక అమ్మకాల సమయంలో త్వరగా తమ వస్తువులను సేల్​ చేయడానికి పబ్లిక్ క్లౌడ్ వైపు మొగ్గుచూపుతున్నారు."

- రిక్ హర్ష్​మన్​, గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్​

'క్లౌడ్​ బేస్డ్ స్మార్ట్ డేటా అనలిటిక్స్ సొల్యూషన్స్ వల్ల చిల్లర వ్యాపారులు.. వినియోగదారుల అభిరుచులు తెలుసుకోగలుగుతున్నారు. వాటిని అందించగలుగుతున్నారు. అలాగే తమ ఉత్పత్తుల జాబితాను సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతున్నారు. ఖర్చులను తగ్గించుకుంటున్నారు' అని రిక్ హర్ష్​మన్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: గేమర్స్​ కోసం రియల్​మీ బడ్జెట్ స్మార్ట్​ఫోన్

Last Updated : Feb 29, 2020, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details