వస్తు, సేవల పన్ను చెల్లిస్తున్న యజమానులు, ప్రమోటర్లు, డైరెక్టర్లకు ఇకపై స్వయంచాలితంగా ఎస్ఎమ్ఎస్లను పంపే వ్యవస్థను జీఎస్టీ నెట్వర్క్ అభివృద్ధి చేసింది. పన్ను చెల్లింపులు, రిటర్నులు దాఖలు చేయడం, వ్యాపార సంస్థల ఐటీసీ క్లెయిమ్‌ల్లో తేడాలు ఉన్నట్లయితే... ఆ విషయాన్ని ఎస్ఎమ్ఎస్ల ద్వారా తెలియజేస్తామని జీఎస్టీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రకాశ్‌కుమార్ తెలిపారు.
జీఎస్టీ వ్యవస్థ 'రెడ్ ఫ్లాగ్' హెచ్చరిక జారీ చేసిన తరువాత, పన్ను చెల్లింపుదారుడిని అప్రమత్తం చేసి, తగిన చర్యలు తీసుకునే విధంగా చేస్తామని ప్రకాశ్ కుమార్ అన్నారు. అందులో భాగంగా ఈ సమాచారాన్ని రెవెన్యూ శాఖతోనూ పంచుకుంటామని తెలిపారు.
"జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-1... జీఎస్టీఆర్-3బీ, ఈ-వే బిల్లుల మధ్య వ్యత్యాసం ఉన్నచోట అధీకృత వ్యక్తులకు రిమైండ్ ఎస్ఎమ్ఎస్లు వెళ్తాయి. వీరితో పాటు ప్రమోటర్లకు, బోర్డు డైరెక్టర్లకూ ఈ ఎస్ఎమ్ఎస్లు వెళ్తాయి. రిటర్నులు దాఖలు చేసిన మూడు రోజుల తరువాత జీఎస్టీ వ్యవస్థ స్వయంచాలితంగా ఈ ఎస్ఎమ్ఎస్లు పంపుతుంది." -ప్రకాశ్ కుమార్, జీఎస్టీ నెట్వర్క్ ముఖ్యకార్యనిర్వహణాధికారి
"ఐటీ రిటర్నుల దాఖలు, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) చెల్లింపుల్లో అసమతుల్యతలు వంటి సమాచారమంతా పన్ను చెల్లింపుదారులకు వారి డాష్‌బోర్డ్‌లోనే చూపిస్తున్నాము. ఎందుకంటే డాష్‌బోర్డ్‌ను అకౌంట్స్ చూసే వ్యక్తి లేదా సీఎఫ్ఓ మాత్రమే చూస్తుండవచ్చు. అందువల్ల ఆ విషయాలు ప్రమోటర్లకు తెలియకపోవచ్చు. అందుకే ప్రమోటర్లకూ ఎస్ఎమ్ఎస్లు పంపిస్తున్నాము."-ప్రకాశ్ కుమార్, జీఎస్టీ నెట్వర్క్ ముఖ్యకార్యనిర్వహణాధికారి