తెలంగాణ

telangana

ETV Bharat / business

సర్కారీ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా! - govt latest decisions

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలో రెండో అతిపెద్దదిగా ఉన్న భారత్ పెట్రోలియం సంస్థ, షిప్పింగ్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ వాటాలు విక్రయించడానికి ఆమోదం తెలిపింది. నిన్న రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కారు.

ప్రభత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా

By

Published : Nov 21, 2019, 9:58 AM IST

మునుపెన్నడూ లేనంత భారీస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రైవేటీకరణకు పచ్చజెండా చూపింది. ప్రభుత్వరంగ చమురు సంస్థల్లో రెండో అతిపెద్దదిగా నిలిచే భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)తో పాటు, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)లో, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌)లలో ప్రభుత్వ వాటాలు విక్రయించడానికి ఆమోదం తెలిపింది. బుధవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ కీలక నిర్ణయం తీసుకొంది.

యాజమాన్య హక్కులు కోల్పోకుండా.. ఐవోసీ వంటి ఎంపిక చేసిన ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాను 51 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది. మరో అయిదు సంస్థల్లో ప్రభుత్వ వాటాతో పాటు, యాజమాన్య హక్కులను కూడా కొనుగోలుదారుకు బదిలీ చేయడానికి పచ్చజెండా ఊపింది. ఆర్థిక మందగమనం వల్ల పడిపోయిన రెవెన్యూ వసూళ్లకు ఊతమివ్వడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేబినెట్‌ సమావేశానంతరం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకరులకు వెల్లడించారు.

  • బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 53.29 శాతంతో పాటు, యాజమాన్య హక్కులను కొనుగోలుదారుకు వదిలిపెట్టాలని నిర్ణయం. అసోంలోని నుమాలీగర్‌లో ఉన్న రిఫైనరీ మినహాయించి మిగిలిన బీపీసీఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ.
  • షిప్పింగ్‌ కార్పొరేషన్‌లో ప్రభుత్వ వాటా 63.75 శాతంతోపాటు యాజమాన్య హక్కులను పూర్తిగా బదలాయించాలని నిర్ణయం.
  • కాంకర్‌లో ప్రభుత్వ వాటా 30.8%తో పాటు యాజమాన్య హక్కులను బదలాయించాలని తీర్మానం.
  • తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ప్రభుత్వానికి ఉన్న 74% వాటాతోపాటు, యాజమాన్య హక్కులనూ విక్రయించాలని నిర్ణయం. దీన్ని ఎన్‌టీపీసీకి అప్పగిస్తారు.
  • ఈశాన్య భారత విద్యుదుత్పత్తి సంస్థలో కేంద్రానికున్న 100% వాటా, యాజమాన్య హక్కులు పూర్తిగా ఎన్‌టీపీసీకి అప్పగింత.
  • ఏదైనా ప్రైవేటు సంస్థకు అనుకూలంగా వచ్చిన ఆర్బిట్రేషన్‌ను ప్రభుత్వ రంగ సంస్థ సవాల్‌ చేసి ఉండి, ఇంతవరకూ ఆర్బిట్రేషన్‌ మొత్తం చెల్లించకపోతే ఇప్పుడు అందులో 75% మొత్తాన్ని ప్రైవేటు సంస్థకు చెల్లించాలని నిర్ణయించాం.
  • ప్రభుత్వ వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయి, ఏడాది కాలంగా టోల్‌ వసూలు చేస్తుంటే వాటిని ‘టోల్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌’ (టీవోటీ) విధానానికి మార్చవచ్చు. ఇదివరకు రెండేళ్ల వరకు ఇలాంటి అవకాశం ఉండేది కాదు. ప్రాజెక్టును బట్టి సుంకం వసూలు వ్యవధిని 15-30 ఏళ్ల మధ్యలో నిర్ణయించడానికి అనుమతించారు.
  • వినియోగ రుసుములను పూచీకత్తుగా పెట్టి బ్యాంకుల నుంచి దీర్ఘకాలిక రుణాలు పొందడానికి అనుమతి ఇచ్చారు.
  • గిఫ్ట్‌సిటీలోని ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌లో అన్ని ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించడానికి ఒక ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆమోదముద్ర వేశారు. 8 నియంత్రణ సంస్థలు ఒక్కటై అక్కడి కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఇందులో సెబీ, ఆర్‌బీఐ, పీఎఫ్‌ఆర్‌డీలాంటి సంస్థలన్ని ఒక్కటిగా మారుతాయి. అన్నీ కలిపి ఒక విశిష్ఠ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తాయి.
  • కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపునకు సంబంధించి ఇదివరకు జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో పార్లమెంటులో బిల్లు పెట్టాలని నిర్ణయించారు.
  • విదేశాల నుంచి 1.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
  • పారిశ్రామిక సంబంధాల స్మృతి (కోడ్‌) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన కొన్ని నిబంధనల్ని దీనిలో చేర్చారు. ప్రయోజనాల వరకు స్థిర కాల వ్యవధి (ఫిక్స్‌డ్‌ టెర్మ్‌)పై పనిచేస్తున్న కార్మికులనూ శాశ్వత కార్మికులతో సమానంగా పరిగణిస్తారు.

ABOUT THE AUTHOR

...view details