భారతీయ రైల్వే తన చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేటు కంపెనీలకు తలుపులు తెరచింది. 109 జతల మార్గాల్లో 151 ఆధునిక రైళ్ల కార్యకలాపాలకు ప్రైవేటు కంపెనీలకు ఆహ్వానం పలికింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నదే అయినా.. కార్యరూపానికి బిడ్ల ఆహ్వానం ద్వారా తొలి అడుగు పడింది. ఇది రైల్వేస్‌కు, ప్రైవేటు కంపెనీలకు, ప్రజలకు ఎంత మేలు చేస్తుందన్నదే ఇపుడు రైలు కూతంత గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న.
రైల్వేల ఆధునికీకరణ, విస్తరణ అనేది ఇప్పటి అంశం కాదు. ఇప్పటిదాకా పలు కమిటీలు దీనిపై పనిచేశాయి. అయితే 2015లో వివేక్ దేవ్‌రాయ్ ఆధ్వర్యంలోని ప్యానెల్ చేసిన సిఫారసుల ప్రకారమే తాజా బిడ్ల ఆహ్వానం జరిగింది. దీనిని ప్రైవేటీకరణ అనరాదని.. సరళీకరణ అని కమిటీయే అంటోంది. అది కూడా నిజమే. ఎందుకంటే మొత్తం కార్యకలాపాల్లో కేవలం 5 శాతం మాత్రమే ప్రైవేటుకు అప్పగించడానికి భారత రైల్వే సన్నాహాలు చేస్తోంది.
- తొలి ప్రైవేటు రైలు - ఏప్రిల్ 2023
- అంచనా పెట్టుబడులు - రూ.30,000 కోట్లు
- ఆసక్తి చూపుతున్న కంపెనీలు - 20
ఎందుకు ఈ నిర్ణయం..
ప్రయాణికుల దృష్టితో చూస్తే పెద్ద పెద్ద నగరాల మధ్య ఇప్పటికీ మరిన్ని రైళ్ల అవసరం చాలా ఉంది. సామర్థ్యం లేని కారణంగా 5 కోట్ల మంది ప్రయాణికులను రైళ్లలోకి అనుమతించలేకపోయామని రైల్వే బోర్డే చెబుతోంది. ఇక వేసవి, పండుగల సీజనులో ఈ డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో విస్తరణ చేయకపోతే.. వచ్చే కొన్నేళ్లలో తన వాటాను రోడ్డు ప్రయాణానికి కోల్పోవాల్సి ఉంటుందని భయపడుతోంది. అదీకాక 'భారత్‌లో తయారీ'ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సైతం దేవ్‌రాయ్ కమిటీ గుర్తించింది. ప్రయాణ నాణ్యతను పెంచుతామన్న హామీ ఉంటే ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని సైతం కమిటీ తేల్చింది. అందుకే రైళ్ల కార్యకలాపాల్లోకి ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం పలకాల్సి వస్తోంది.
ప్రయాణికులకు మంచిదేనా..
ఏ రంగంలోనైనా ఏకఛత్రాధిపత్యం మంచిది కాదు. పోటీ ఉంటేనే మంచిది. అయితే ఇన్నాళ్లూ భారత రైల్వేలు ఆదాయాన్ని కాకుండా.. ప్రజలను దృష్టిలో ఉంచుకునే రేట్లను నిర్ణయించింది. రవాణాపై ఎక్కువ ధర పెట్టి ఆ లోటును పూడ్చుకునేది. మరి ఇపుడు ప్రైవేటు సంస్థలు చేపట్టే ఈ కార్యకలాపాల ద్వారా ప్రయాణికులకు ఎంత మేలు జరుగుతుందన్నది చూడాలి. భారత రైల్వేలా ప్రైవేటు కంపెనీలు ఆలోచించకపోవచ్చు. ఆదాయంపైనే దృష్టి పెట్టవచ్చు. అయితే నాణ్యత మాత్రం మెరుగుపడే అవకాశం ఉంది. కాస్త ధర ఎక్కువైనా ప్రయాణికులు కోరుకుంటున్నది అదే. ప్రస్తుతానికి పైలట్ పథకంలా కనిపిస్తున్న ఈ నిర్ణయం విజయవంతమైతే.. మరిన్ని రూట్లకు ప్రైవేటుకు ఆహ్వానం పలికే అవకాశం లేకపోలేదు.
రైళ్లు ప్రైవేటీకరించిన దేశాలు బరిలో ఈ కంపెనీలు
ఆహ్వానించిన బిడ్ ప్రకారం.. రూ.30,000 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ఒక్కోటీ 16 కోచ్‌లుండే 151 రైళ్లను నడపడానికి దాదాపు 20 కంపెనీల వరకు ఆసక్తి చూపుతున్నట్లు తొలి బిడ్డింగ్ ప్రక్రియ ప్రరకారం తెలుస్తోంది. అందులో అదానీ పోర్ట్, టాటా రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రా, ఎసెల్ గ్రూప్, బొంబార్డియర్ ఇండియా, సీమెన్స్ ఏజీ, మెక్వారీ గ్రూప్ వంటి గట్టి పోటీదారులున్నాయి. విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.
- అదానీ పోర్ట్:ఈ కంపెనీకి ముందే అనుభవం ఉంది. పోర్టులకు అనుసంధానం కలిగించడం కోసం 300కి.మీ. ప్రైవేటు రైల్వే లైన్లను కలిగి ఉంది. భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులను చేపట్టిన అనుభవమూ సొంతం. ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్టుల్లోనూ భాగస్వామాన్ని కలిగి ఉంది.
- ఎసెల్ గ్రూప్: దశాబ్దాలుగా ఈ కంపెనీ పలు ప్రభుత్వ మౌలిక ప్రాజెక్టులను చేపడుతోంది. ఎసెల్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ ద్వారా తొలి రైల్వే ప్రాజెక్టును 2018లో పొందింది కూడా.
- టాటా రియల్టీ అండ్ ఇన్‌ఫ్రా: పుణెలో హింజెవాడి-శివాజీ నగర్ మెట్రో ప్రాజెక్టుకు ఈ టాటా గ్రూప్ అనుబంధ సంస్థే బాధ్యత వహిస్తోంది. దిల్లీ-మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో భూగర్భ మార్గాన్ని నిర్మించడంలో పాలుపంచుకుంది కూడా.
- బొంబార్డియర్: జర్మనీకి చెందిన ఈ కంపెనీ కూడా గట్టిపోటీదారే. మన దేశంలో 50 ఏళ్ల కిందటే సొంత రైల్వే వాహన తయారీ ప్లాంటును ఏర్పాటు చేసిన తొలి విదేశీ బహుళజాతి కంపెనీ ఇది.
- అల్‌స్తోమ్: ఫ్రాన్స్‌కు చెందిన మరో విదేశీ కంపెనీ ఇది. భారత్‌లో పలు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను చేపట్టిందీ కంపెనీ.
ఈ షేర్ల పరుగులు
ప్యాసింజరు రైళ్ల కార్యకలాపాల నిర్వహణకు ప్రైవేటు కంపెనీలకు అనుమతించే ప్రణాళికలను భారత రైల్వే ప్రకటించిన నేపథ్యంలో రైళ్లతో అనుబంధం ఉన్న కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో ఉరకలేస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ, రైల్ వికాస్ నిగమ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, టిటాగఢ్ వ్యాగన్, టెక్స్‌మాకో రైల్, సిమ్కో, స్టోన్ ఇండియా వంటి కంపెనీల షేర్లు ఇటీవల కాలంలో గణనీయంగా లాభపడ్డాయి.
ఇదీ చూడండి:'వస్తువేదైనా ఏ దేశంలో తయారైందో చూపాల్సిందే'