కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వానికి తమ వంతు సహాయం చేసేందుకు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ముందుకొచ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం.. రోజుకు 10 లక్షల డోసులను ప్రజలకు సురక్షితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ లభించే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ శోభన కామినేని వెల్లడించారు. ఇందుకోసం ఫార్మసీలు, క్లినిక్స్, దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆసుపత్రుల్లోని 10వేల మంది నిపుణులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.
"దేశవ్యాప్తంగా అపోలో నెట్వర్క్ విస్తరించి ఉంది. దాదాపు 30 శాతం మంది ప్రజలు అపోలో కేంద్రానికి కేవలం 30 నిమిషాల దూరంలో ఉన్నారు. రోజుకు 10 లక్షల డోసులను అందించే సామర్థ్యం ప్రతి కేంద్రానికి ఉంది. ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాలతో వ్యాక్సిన్ను అందించేందుకు నిపుణులకు శిక్షణ ఇచ్చాం."