ఓ వైపు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగి ప్రజలు నడ్డి విరుస్తున్న వేళ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే భాజపా పాలిత రాష్ట్రాలు అయిన మధ్యప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్ రూ. 100 మార్కును దాటిన విషయంపై నోరు మెదపలేదు.
దిల్లీలోని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ధర్మేంద్ర పాల్గొన్నారు. కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చులను తీర్చడానికి పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై పన్నును అదనంగా వసూలు చేయాల్సి వస్తుందని మంత్రి వివరించారు.
"రాహుల్ గాంధీ కూడా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పదేపదే మా ప్రభుత్వంపై దాడికి దిగుతారు. కానీ వాళ్లు (కాంగ్రెస్) అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ధరలు తగ్గడం లేదో చెప్పాలి. వినియోగదారులు ఇంధన ధరలు తట్టుకోలేకపోతున్నారనేది నేను అంగీకరిస్తాను. టీకాలు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం పెద్దమొత్తంలో డబ్బు వెచ్చిస్తోంది. ఈ ఏడాది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడానికి ప్రభుత్వం రూ. లక్ష కోట్లుకు పైగానే ఖర్చు చేస్తోంది. ఈ సమయంలో ధరల పెంపు తప్పదు."