గత కొన్నాళ్లుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. పెట్టుబడి పెట్టిన వారికి మంచి రాబడినే అందించింది ఈ విలువైన లోహం. దీనికి సురక్షిత పెట్టుబడిగా పేరుండటం వల్ల.. ప్రజలు కూడా పసిడిపై ఆసక్తి చూపుతున్నారు.
అయితే.. చాలా మందికి బంగారంపై భౌతికంగా పెట్టుబడి పెట్టాలా? డిజిటల్‌గా మదుపు చేయాలా? అనే విషయంలో సందిగ్ధ పడుతున్నారు. అయితే.. నగలు అవసరం అనుకుంటే మాత్రమే భౌతికంగా బంగారం కొనుగోలు చేయాలని.. పెట్టుబడి కోసమైతే డిజిటల్ పద్ధతే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
భౌతిక బంగారంపై పెట్టుబడితో సమస్యలు...
బంగారాన్ని భౌతికంగా కొనుగోలు చేస్తే.. పలు సమస్యలు ఉన్నాయి. బంగారాన్ని సురక్షితంగా దాచటం అనేది ప్రధాన సమస్య. బ్యాంకు లాకర్లో పెట్టినట్లయితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నగలు, కాయిన్ల రూపంలో ఇంట్లో పెట్టుకున్నట్లయితే దొంగతనం భయాలు ఎక్కువ. స్వచ్ఛత తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా విక్రయించేటప్పుడు తరుగు సమస్య కూడా ఉంటుంది.
డిజిటల్ పద్ధతుల్లో పెట్టుబడుల ద్వారా ప్రయోజనాలు...
ఈ సమస్యలేవీ ఉండొద్దంటే.. డిజిటల్ పద్ధతుల ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ గోల్డ్‌లో నాణ్యత విషయంలో సమస్యే ఉండదు. వెబ్సైట్, యాప్‌ల ద్వారా ఎంత బంగారం ఉందన్నది చూసుకోవచ్చు. భౌతికంగా ఎలాంటి బంగారం ఉండదు కాబట్టి నిల్వ, తరుగు సమస్యలకు తావుండదు.
డిజిటల్ పద్ధతుల ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టినట్లయితే ఉపసంహరణ కూడా చాలా సులభం. ఒక్క క్లిక్ ద్వారా విక్రయించి లాభాలను తీసుకోవచ్చు. అదే భౌతికం బంగారాన్ని విక్రయించాలంటే కొంత అసౌకర్యంగా ఉంటుంది. దాని స్వచ్ఛతకు సంబంధించిన తనిఖీలు, ధృవీకరణ పత్రాలు లాంటి వాటి అవసరం ఉంటుంది.