డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం గూగుల్ పే కన్నా వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్ పేను జనం ఎక్కువగా వినియోగించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. ఈ మేరకు డిసెంబరు నెల గణాంకాలను ఎన్‌పీసీఐ విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం డిసెంబర్ నెలలో ఫోన్‌పేలో 902.03 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ 1,82,126.88 కోట్లుగా ఉంది. అలాగే, 854.49 మిలియన్ల లావాదేవీలతో గూగుల్‌పే రెండో స్థానానికి చేరింది. దీనిలో జరిగిన డిజిటల్ చెల్లింపుల విలువ 1,76,199.33 కోట్లుగా ఉంది. డిసెంబరులో జరిగిన మొత్తం లావాదేవీల్లో ఈ రెండు యాప్లు 78 శాతం వాటాను నమోదు చేసుకున్నాయి. నవంబరు నెలతో పోలిస్తే యూపీఐ పేమెంట్లలో ఫోన్‌పే 3.87 శాతం పెరుగుదలను నమోదు చేయగా.. గూగుల్ పే 11శాతం లోటును నమోదు చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మూడో స్థానంలో ఉండగా, అమెజాన్ పే, ఎన్‌పీసీఐకు చెందిన బీహెచ్‌ఐఎం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్ పే! - డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పే గూగుల్ పేను దాటేసింది
డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పే.. గూగుల్ పేను దాటేసింది. భారత్‌లో ప్రజలు ఆన్లైన్ చెల్లింపుల విషయంలో ఫోన్ పేను ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది.
నవంబరు నుంచి డిజిటల్ చెల్లింపులను ప్రారంభించిన వాట్సాప్‌లో డిసెంబరులో 8లక్షలకు పైగా లావాదేవీలు జరగ్గా.. వీటి మొత్తం విలువ 29.72కోట్లుగా ఉంది. మొత్తంగా డిజిటల్ చెల్లింపులు డిసెంబరు నెలలో 1.08 శాతం పెరిగాయని, ప్రస్తుతం 207 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. థర్డ్ పార్టీ యాప్ (టీపీఏ) ప్రొవైడర్లు అందిస్తున్న యూపీఐ లావాదేవీలపై నవంబర్లో ఎన్‌పీసీఐ 30 శాతం పరిమితిని ప్రకటించింది. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రభావం ఫోన్‌పే, గూగుల్ పేతో సహా ఇతర ప్లాట్‌ఫాంలపై ఎక్కువగా ఉండనుంది. అదేసమయంలో పేటీఎం, మొబిక్విక్‌లకు ఈ విధానం సహాయపడనుంది.