ప్రముఖ ఆన్‌లైన్ ఔషధ డెలివరీ కంపెనీ ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ 'ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్' పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 1 బిలియన్ డాలర్లు సమీకరించేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. మార్చి 2022 నాటికి ఐపీఓకి రావాలని సలహాదారులతో కంపెనీ యాజమాన్యం సమాలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జరుగుతున్న చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు తెలిపారు.
ఫార్మ్‌ఈజీ ఇప్పటి వరకు ఔషధాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, ఇతర ఆరోగ్య సంరక్షణా కిట్లు కలుపుకొని మొత్తం 15 మిలియన్ల ఆర్డర్లను దాదాపు 5 మిలియన్ల కుటుంబాలకు అందజేసినట్లు సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. మొత్తం 1000 పట్టణాలకు సేవలు విస్తరించాయి. థైరోకేర్ టెక్నాలజీస్‌లో 611 మిలియన్ డాలర్లతో మెజారిటీ వాటాను ఇటీవలే కొనుగోలు చేసింది.