తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆవిష్కరణ ఎక్కడైనా తయారీ భారత్​లోనే - corona vaccine making companies

కరోనా టీకాల తయారీ కేంద్రంగా భారత్ అవతరించబోతోంది. కొవిడ్‌-19 టీకాలను ఆవిష్కరించిన ప్రపంచ స్థాయి ఔషధ సంస్థలతో దేశీయ ఫార్మా కంపెనీలు తయారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం, దేశీయంగా ముమ్మర పరిశోధనలు సాగటం దీనికి ప్రధాన కారణం. టీకాల తయారీకి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌కు కాంట్రాక్టు తయారీ ఒప్పందం ఉంది. ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకుని కొవిడ్‌-19 టీకా తయారు చేయడానికి అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా, ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌.... సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Pharma companies building vaccine production units in india
ఆవిష్కరణ ఎక్కడైనా తయారీ భారత్​లోనే

By

Published : Jan 26, 2021, 7:05 AM IST

కొవిడ్‌-19 టీకాల తయారీకి ప్రపంచానికే మనదేశం కేంద్ర స్థానం కాబోతోంది. వచ్చే ఏడాది కాలంలో ఎన్నో సంస్థలకు చెందిన టీకాలు మనదేశంలో తయారై, ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే అవకాశముంది. కొవిడ్‌-19 టీకాలను ఆవిష్కరించిన ప్రపంచ స్థాయి ఔషధ సంస్థలతో దేశీయ ఫార్మా కంపెనీలు తయారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం, దేశీయంగా ముమ్మర పరిశోధనలు సాగటం దీనికి ప్రధాన కారణం. టీకాల తయారీకి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌కు కాంట్రాక్టు తయారీ ఒప్పందం ఉంది. ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకుని కొవిడ్‌-19 టీకా తయారు చేయడానికి అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా, ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌.... సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా టీకాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే యత్నాల్లో అరబిందో ఫార్మా, మరికొన్ని సంస్థలు నిమగ్నమయ్యాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి టీకాను ఇక్కడే తయారు చేసి అందించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చేస్తున్న ప్రయత్నాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.

వివిధ దశల్లో 30 రకాల టీకా ప్రాజెక్టులు

  • మనదేశంలో 30 రకాల కొవిడ్‌-19 టీకా తయారీ ప్రాజెక్టులను ఫార్మా కంపెనీలు, పరిశోధనా సంస్థలు నిర్వహిస్తున్నాయి.
  • ఇప్పటికే రెండు టీకాలు మనదేశం నుంచి అందుబాటులోకి వచ్చాయి. అందులో భారత్‌ బయోటెక్‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ పూర్తిగా దేశీయ టీకా. కొవిషీల్డ్‌ ను ఆస్ట్రజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కలిసి అభివృద్ధి చేయగా, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోంది. ఈ టీకాలను ఇప్పటికే దేశీయంగా అత్యవసరంగా వినియోగిస్తుండగా, విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ‘కొవాగ్జిన్‌’ పై మూడోదశ క్లినికల్‌ పరీక్షలు పూర్తయితే, అది కూడా పెద్దఎత్తున దేశీయంగా వినియోగంలోకి రావడంతో పాటు ఎగుమతి అవుతుందని తెలుస్తోంది.
  • మరో అయిదు ప్రాజెక్టులు ‘అడ్వాన్స్‌ స్టేజ్‌’ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. జైడస్‌ క్యాడిలాకు చెందిన డీఎన్‌ఏ టీకా- జైకోవ్‌-డి, రష్యా టీకా స్పుత్నిక్‌ వి మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఒకపక్క జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో టీకా తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో పాటు, సొంతంగా ప్రొటీన్‌ సబ్‌యూనిట్‌ టీకా ‘కేండిడేట్‌’ పై పరిశోధనలు నిర్వహిస్తోంది. దీనిపై ఇప్పుడు ఫేజ్‌-1/ 2 పరీక్షలు జరుగుతున్నాయి. జెన్నోవా అనే మరొక సంస్థ ఎం-ఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకా తయారీకి పరిశోధనలు నిర్వహిస్తోంది.
  • ముక్కుద్వారా ఇచ్చే టీకా ఆవిష్కరించేందుకు భారత్‌ యోటెక్‌ ప్రయత్నాలు చేస్తోంది. టీకాపై తొలిదశ క్లినికల్‌ పరీక్షలు 75 మందిపై నిర్వహించాలని ఇండియన్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌కు చెందిన నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) భారత్‌ బయోటెక్‌ను ఆదేశించినట్లు తెలిసింది.ప్రోటోకాల్‌ ప్రకారం వీరిపై పరీక్షలు నిర్వహించి భద్రత, రోగనిరోధక శక్తి అభివృద్ధి ఎలా చోటుచేసుకుందనే వివరాలను సంస్థ సమర్పించాక, రెండోదశ క్లినికల్‌ పరీక్షలకు అనుమతి ఇస్తామని ఎస్‌ఈసీ తెలిపింది.
  • ఇంకో 3 టీకా ప్రాజెక్టులు ప్రీ-క్లినికల్‌ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు చాలా మేరకు విజయం సాధిస్తాయని, తద్వారా కొవిడ్‌-19 టీకాలను పెద్దఎత్తున తయారు చేసి, విదేశాలకు అందించే అవకాశం మనదేశానికి లభిస్తుందని ప్రభుత్వ - పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

టీకా అభివృద్ధి యత్నాలకు మెర్క్‌ ఫుల్‌స్టాప్‌!

అగ్రశ్రేణి టీకాల తయారీ సంస్థ మెర్క్‌ లిమిటెడ్‌ కొవిడ్‌-19 టీకా తయారీ యత్నాలను ఆపేసింది. టీకా తయారీ నిమిత్తం ఈ సంస్థ రెండు ప్రాజెక్టులు చేపట్టినా, ప్రాథమిక అధ్యయనాల్లో ఆశాజనక ఫలితాలు రాకపోవడంతో నిలిపేస్తున్నట్లు తాజాగా మెర్క్‌ స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా కొవిడ్‌-19 వ్యాధికి చికిత్స చేసే మార్గాలపై అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించింది.
‘మేం రూపొందించిన కొవిడ్‌-19 టీకాలతో రోగుల్లో ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ తలెత్తలేదు, కానీ వ్యాధిని ఎదిరించేందుకు అవసరమైనంత రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడం లేదని తేలింది’ అని మెర్క్‌ వివరించింది. ఇతర కంపెనీలతో పోల్చితే మెర్క్‌, కొంత ఆలస్యంగా చేపట్టిన ప్రాజెక్టులో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది.

జైడస్‌ క్యాడిలా కొవిడ్‌-19 ఔషధంపై ఫేజ్‌-2 (బి) పరీక్షలు సానుకూలం

కొవిడ్‌-19 చికిత్సలో ఉపయోగపడేదిగా భావిస్తున్న ‘డెసిడస్టేట్‌’ అనే ఔషధ మూలకణంపై మెక్సికోలో నిర్వహించిన ఫేజ్‌-2 (బి) పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు జైడస్‌ క్యాడిలా వెల్లడించింది. కొవిడ్‌-19 సోకిన వారిలో ‘హైపోగ్జియా’ లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని అవయవాలు పనిచేయకుండా పోవచ్చు. యాంటీ-వైరల్‌, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలు వినియోగించినా ఫలితం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ‘డెసిడస్టేట్‌’ తో చికిత్స వల్ల రోగిలో ఎర్ర రక్తకణాలు పెరుగుతున్నట్లు, ఆక్సిజన్‌ పంపిణీ మెరుగైనట్లు స్పష్టమైందని జైడస్‌ క్యాడిలా వివరించింది. ఈ ఫలితాలు తమలో ఎంతో ఆసక్తి రేకెత్తించినట్లు జైడస్‌ గ్రూపు ఛైర్మన్‌ పంకజ్‌ ఆర్‌ పటేల్‌ పేర్కొన్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

మనకూ ఫైజర్‌, మోడెర్నా టీకాలు?

అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థలు ఫైజర్‌, మోడెర్నా అభివృద్ధి చేసిన టీకాలు త్వరలో మనదేశంలో లభ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ‘కొవాక్స్‌’ ద్వారా ఈ టీకాలు మనదేశానికి సరఫరా అవుతాయని సమాచారం. గావి, ద వ్యాక్సిన్‌ అలియన్స్‌, సీఈపీఐ, డబ్లూహెచ్‌ఓ ల సంయుక్త కార్యాచరణ పథకమే ‘కొవాక్స్‌‘. మధ్య, అల్పాదాయాలు కలిగిన 92 దేశాలకు టీకాలు అందించాలనే లక్ష్యంతో దీన్ని చేపట్టారు. ఇందులో మనదేశం కూడా ఉంది. ‘కొవాక్స్‌’ తో ఇప్పటికే ఫైజర్‌ టీకా సరఫరా ఒప్పందం కుదుర్చుకోగా, మోడెర్నా కూడా సంప్రదింపులు చేపట్టింది. దీంతో కూడా ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ రెండు సంస్థల టీకాలు మనదేశానికి సరఫరా అయ్యే అవకాశాలు ఏర్పడతాయి.

ఇదీ చూడండి: బడ్జెట్ తర్వాత తగ్గనున్న ఆ వస్తువుల ధరలు!

ABOUT THE AUTHOR

...view details