తెలంగాణ

telangana

ETV Bharat / business

రోజురోజుకూ మండిపోతున్న పెట్రో ధరలు - Petrol prices in India

ముడిసరకు ధర తగ్గితే... దాంతో తయారైన వస్తువు ధర కూడా తగ్గుతుందన్నది సాధారణ ఆర్థిక సూత్రం. కానీ పెట్రో ఉత్పత్తులకు ఈ నియమం వర్తించడం లేదు. బ్యారెల్‌ చమురు ధర తగ్గుతున్నా.. దేశంలో రోజురోజుకూ పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. గత 12 రోజుల్లో లీటరుపై రూ. 6కు పైగా మోత మోగింది. డీజిల్​ ధర కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.

Petrol price
రోజురోజుకూ రాజుకుంటూ... మండిపోతున్న పెట్రో ధరలు

By

Published : Jun 19, 2020, 6:38 AM IST

కరోనా పోటుతో అసలే వ్యాపారాలు సాగక, పనులు దొరక్క, ఆదాయాలు తగ్గిపోయి బడుగు, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతుంటే పుండుమీద కారం చల్లినట్లు పెట్రో ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బాగా తక్కువగా ఉన్నా.. మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధర లు తగ్గకపోగా, పైపైకి ఎగబాకుతున్నాయి. గత 12 రోజులుగా ప్రతి రోజూ ధర పెరుగుతూనే ఉంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు హైదరాబాద్‌లో లీటరుకు ఆరు రూపాయలకుపైనే పెరిగింది. గురువారం నాటికి పెట్రోలు ధర లీటరు రూ.80.77, డీజిల్‌ ధర రూ.74.70. రెండేళ్ల క్రితం.. 2018 అక్టోబరులో ఒకసారి ఈ స్థాయిలో ధరలు పెరిగాయి.

అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 65 డాలర్లు కాగా, ఇప్పుడు 40 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు అమ్మకాలను ఆదాయ వనరుగా మార్చుకోవటమే ఈ ధరల పెరుగుదలకు కారణం. దీనికి తోడు దేశీయ చమురు కంపెనీలు సైతం సందట్లో సడేమియా...అనే చందాన తమ నష్టాలు పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలకు నొప్పి తెలియకుండా రోజుకు 40 పైసలు, 55 పైసలు, 60 పైసల చొప్పున వడ్డిస్తూ, పన్నులు, సెస్‌ రూపంలో ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. దాదాపు రెండున్నర నెలల పాటు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి 'లాక్‌డౌన్‌' వల్ల పెద్దగా డిమాండ్‌ లేక ప్రతి రోజూ ధరలు సవరించే పద్ధతిని చమురు కంపెనీలు నిలిపేశాయి. ఆంక్షలు సడలించాక పెట్రోలు, డీజిల్‌కు గిరాకీ పెరగడంతో నష్టాలను పూడ్చుకోవటానికంటూ ధరలు పెంచేస్తున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి మళ్లీ రోజువారీ ధరల సవరణ మొదలు పెట్టాయి. తమ నష్టాలు తగ్గే వరకూ పెంపుదల ఉంటుందంటున్నాయి కంపెనీలు. ఈ పరిస్థితి అన్ని వర్గాల ప్రజలకు తలకు మించిన భారమవుతోంది.

ముడి చమురు ధర పతనం

అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఒక బ్యారెల్‌ ముడి చమురు (డబ్ల్యూటీఐ క్రూడ్‌) ధర 12.78 డాలర్లకు పడిపోయింది. అంతకు ముందు ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఇంకా తక్కువ ధర ఉంది. చమురు ఉత్పత్తి తగ్గింపు విషయంలో సౌదీ అరేబియా, రష్యా ఒక అవగాహనకు రాలేకపోవటం, అమెరికా, రష్యా, సౌదీ... తదితర దేశాలు అధికోత్పత్తిని కొనసాగించటం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అదే సమయంలో కొవిడ్‌- 19 సమస్య విస్తరించటం కూడా సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో అనూహ్యంగా చమురు ధర పతనమైంది. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి నెమ్మదిగా ధరలు కోలుకున్నాయి. ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ 40.86 వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 38.14 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇండియన్‌ బాస్కెట్‌ క్రూడ్‌ ధర 40 డాలర్లకు కాస్త పైనే ఉంది. కొంతకాలం వరకు చమురు ధర 60 డాలర్లకు మించే అవకాశం లేదని అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. దాని ప్రకారం చూస్తే మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధరలు ఎంతో తక్కువగా ఉండాలి. కానీ పన్నుల భారం అధికంగా ఉండటం వల్ల ముడి చమురు ధర తగ్గిన మేరకు రిటైల్‌ ధరలు తగ్గటం లేదు.

12 రోజులుగా పెరిగిన పెట్రోల్​ ధరల వివరాలు

జీఎస్‌టీ కిందకు తీసుకురావాలి

పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం పన్నులు వడ్డిస్తున్నందున, పెట్రోలు, డీజిల్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకురావాలనే డిమాండ్‌ కొంతకాలంగా వినిపిస్తోంది. జీఎస్‌టీ కింద ఉన్న వస్తువులపై పన్ను శాతాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ఇష్టానుసారం పన్ను విధించటానికి అవకాశం ఉండదు. దానివల్ల వినియోగదారుడికి కొంత ఊరట లభిస్తుంది. ఈ డిమాండుకు అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రాలు కానీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. తమ ఆదాయ మార్గాలకు గండి పడుతుందనే ఆందోళనే దీనికి కారణం.

అసలు పాతికే

సాధారణంగా లీటరు పెట్రోలు, డీజిల్‌ తయారీకయ్యే ఖర్చు సుమారు రూ.20- రూ.25. ఎక్సైజ్‌ డ్యూటీ రూ.25 వరకూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ డ్యూటీ, సెస్‌కు తోడు రాష్ట్రాలు విధించే వ్యాట్‌, సెస్‌తో రిటైల్‌ ధర అనూహ్యంగా పెరిగిపోతోంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్డు సెస్‌ పేరుతో ఒకేసారి లీటరు పెట్రోలు మీద రూ.10, డీజిల్‌ మీద రూ.13 చొప్పున భారం మోపింది. పెట్రోలు మీద పెంచిన రూ.10లో ఎక్సైజ్‌ డ్యూటీ రూ.2 మాత్రమే. మిగతా రూ.8 రోడ్డు సెస్‌.

ABOUT THE AUTHOR

...view details