Petrol Price Hike News: వినియోగదారులపై పెట్రో బాంబు పడనుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తోడు అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో గత 4 నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్‌పై పెంపు లీటరుకు 12 రూపాయల వరకు ఉంటుందని చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. నష్టాలను భరించేందుకు ఈనెల 16లోపు ఈ మేరకు పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గత నాలుగు నెలలుగా పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గురువారం తొమ్మిదేళ్ల గరిష్ఠానికి చేరి బ్యారెల్‌కు 120 అమెరికన్ డాలర్లుగా నమోదైంది. ఇవాళ క్రూడాయిల్ ధర కొంత తగ్గి 111 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఇక వచ్చే వారం ఎన్నికలు ముగియనుండగా.. పెట్రోధరల పెంపు అనివార్యమని చమురు సంస్థలు చెబుతున్నాయి.