అసలే కరోనా మహమ్మారితో కష్టకాలంలో ఉన్న సామాన్యులకు ఇంధన ధరలు మరింత భారమవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ కొట్టి పరుగులు పెడుతుండగా.. ఇప్పుడు డీజిల్ కూడా రూ.100 మార్క్ దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు ఉత్పత్తి సంస్థలు శనివారం మరోసారి పెంచాయి. పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 23 పైసలు పెరిగింది. దీంతో రాజస్థాన్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్ జిల్లాలో లీటర్ డీజిల్ ధర రూ.100.05గా ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర కూడా అత్యధికంగా రూ.107.22కు చేరింది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక వ్యాట్ ఉన్న రాష్ట్రం రాజస్థాన్. అందుకే అక్కడ చమురు ధరలు అధికంగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వ్యాట్ ఎక్కువగానే ఉంది. మరోవైపు కర్ణాటకలో పెట్రోల్ ధర రూ.100 దాటింది. దీంతో పెట్రోల్ సెంచరీ కొట్టిన ఏడో రాష్ట్రంగా నిలిచింది. అంతకుముందే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్‌లలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది.