Petrol Price hikes: అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరడం, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుండడంతో వచ్చే వారం నుంచి దేశంలో ఇంధన ధరల మోత మోగే అవకాశముందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర దాదాపు 110 డాలర్లకు చేరింది. 2014 నవంబరు తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌లో రష్యా కొనసాగిస్తున్న ఆక్రమణ నేపథ్యంలో గ్యాస్, ముడిచమురు ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. రష్యాపై పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు కూడా ధరల పెరుగుదలకు మరో కారణం.
ఎంత పెంచొచ్చు?
మార్చి 1 నాటికి భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర బ్యారెల్‌కు 102 డాలర్లకు చేరుకున్నట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ గణాంకాలు చెబుతున్నాయి. గత నవంబరులో ఈ ధర 81.5 డాలర్లుగా ఉంది. దీంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలు ఒక్కో లీటరుపై రూ.5.7 నష్టాన్ని భరిస్తున్నట్లు సమాచారం. కంపెనీ మార్జిన్లు కలుపుకొంటే ఇది మరింత పెరుగుతుంది. మునుపటి తరహాలో సాధారణ మార్జిన్లను కంపెనీలు పొందాలంటే ఒక్కో లీటర్‌పై కనీసం రూ.9 పెంచాల్సి వస్తుందని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది. అయితే, సామాన్యులపై భారాన్ని దించేందుకు ప్రభుత్వం రూ.1-3 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే సూచనలు ఉన్నాయంది. కానీ, రిటైల్ ధరల పెంపు వల్ల ఆ ప్రయోజనం వినియోగదారుడికి చేరకపోవచ్చునని అభిప్రాయపడింది.
మార్చి 7తో ఎన్నికల ప్రక్రియ ముగింపు..
5 states election date 2022: ఇప్పటికే కొన్ని రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మార్చి 7న యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్ సైతం ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. దీంతో మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణను ప్రారంభించే అవకాశం ఉందని అంచనా వేసింది.
రష్యా నుంచి భారత్‌కు ఎగుమతులు తక్కువే.. కానీ,
ఐరోపా సహజవాయు అవసరాల్లో మూడో వంతు రష్యా నుంచే అందుతోంది. ప్రపంచ చమురు అవసరాల్లో 10 శాతం రష్యానే తీరుస్తోంది. రష్యా నుంచి ఐరోపాకు గ్యాస్‌ను సరఫరా చేసే పైప్‌లైన్లలో మూడోవంతు ఉక్రెయిన్ నుంచే వెళుతున్నాయి. అయితే, రష్యా నుంచి భారత్ దిగుమతులు చాలా తక్కువే. 2021లో రష్యా నుంచి భారత్‌కు 43,400 బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి అయ్యింది. ఇది మొత్తం మన చమురు దిగుమతుల్లో 1 శాతం మాత్రమే. మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతానికి సమానమైన 1.8 మిలియన్ టన్నుల బొగ్గు రష్యా నుంచి వస్తోంది. ఏటా 2.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని సైతం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం. సరఫరాలో పెద్దగా ఇబ్బందులు తలెత్తనప్పటికీ.. ధరలు మాత్రం భారత్‌ను కలవరపెడుతున్నాయి.
ప్రస్తుతం ధరలు ఇలా..
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానమై ఉంటాయి. కానీ, గత 118 రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ధరల సవరణను నిలిపివేశాయి. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67గా ఉంది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర 86 డాలర్లకు దిగొచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ రష్యా చమురు సరఫరాలు గనక తీవ్రంగా దెబ్బతింటే స్వల్పకాలంలో 150 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది.
ఇదీ చూడండి:మండుతున్న చమురు ధరలు.. భారత్‌లో ఇక పెట్రోల్ రేట్ల మోతే!