దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే సెంచరీ కొట్టిన లీటర్ పెట్రోల్ ధర.. రికార్డులు బద్దలుకొడుతూ ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. డీజిల్ ధర కూడా తాజాగా పలు నగరాల్లో సెంచరీ దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయి వద్ద కొనసాగుతన్నాయి.
ప్రస్తుత ధరలు ఇలా..
దిల్లీలో.. ఆదివారం (అక్టోబర్ 3) పెట్రోల్ ధర లీటర్‌కు 25 పైసలు పెరగ్గా.. డీజిల్ (లీటర్) 30 పైసలు పుంజుకుంది. దీనితో లీటర్ పెట్రోల్ ధర రూ.102.39 వద్దకు చేరింది. డీజిల్ ధర రూ.90.77 వద్దకు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం.
ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి?
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు తగ్గట్లుగా.. రోజువారీగా సవరిస్తుంటాయి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు(ఓఎంసీలు). 2017లో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది కేంద్రం. ఇందులో భాగంగానే.. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా.. ఆ భారాన్ని వినియోగదారులకూ బదిలీ చేస్తున్నాయి ఓఎంసీలు.
బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం మూడేళ్ల గరిష్ఠమైన 76.71 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా బ్యారెల్ పెట్రోల్ ధర ఒక్క రోజులోనే 85.95 డాలర్ల నుంచి 87.11 డాలర్లకు పెరిగింది. డీజిల్ కూడా బ్యారెల్‌కు 85.95 డాలర్ల నుంచి 87.27 డాలర్లకు ఎగిసింది.
ముడి చమురు ధరలు మూడేళ్ల గరిష్ఠం వద్ద ఉన్నప్పుడు.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మూడు సంవత్సరాల నాటి స్థాయిల్లోనే ఉండాలి కదా? అనే సందేహం చాలా మందికి కలగొచ్చు.
ధరల్లో ఈ స్థాయి వ్యత్యాసం ఉండేందుకు కారణం లేకపోలేదు. కొవిడ్ కారణంగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా గిరాకీ తగ్గి చమురు ధర బ్యారెల్‌కు 20 డాలర్లకు పడిపోయింది. అయితే ఆ మేర ప్రయోజనాలు మాత్రం వినియోగదారులకు బదిలీ కాలేదు. ఎందుకంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్షీణతకు తగ్గట్లు సుంకాలు వడ్డించి.. ఖజానా నింపుకున్నాయి.
కొవిడ్ రాకముందు లీటర్ పెట్రోలుపై రూ.19.98గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని కరోనా కాలంలో రూ.32.98కి, అదే డీజిల్‌పై రూ.15.83గా ఉన్న పన్నును రూ.31.83కు కేంద్రం పెంచింది. ఇక రాష్ట్రాలూ తమ స్థాయికి తగ్గట్లు.. సుంకాలు వడ్డించి ఆదాయం పెంచుకున్నాయి. అయితే పరిస్థితులు కాస్త మెరుగైన తర్వాత.. ముడి చమురు ధరలు పెరుగుతూ పోతున్నా.. తమ ఖజానాకు గండిపడుతుందనే కారణంతో పెంచిన సుంకాల విషయంలో వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
'చమురు సంస్థల ఉదారత'
పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల పెంపుపై తుది నిర్ణయం చమురు మార్కెటింగ్ సంస్థలదేనని పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ ఇటీవల స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మూడేళ్ల గరిష్ఠం వద్ద కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ లెక్క ప్రకారం చూస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు రిటైల్ ధరలు ఇంకా ఎక్కువగా ఉండాలని.. అయితే వినియోగదారులపై అధిక భారం పడకుండా ధరల విషయంలో చమురు మార్కెటింగ్ సంస్థలు 'ఉదారంగా' వ్యవహరిస్తున్నాయని చెప్పారు.
ఎల్పీజీ ధరలనే చూస్తే.. నెల రోజుల్లో 665 డాలర్ల నుంచి 797 డాలర్లకు పెరిగిందని.. అయితే ఈ భారాన్ని ఓఎంసీలు వినియోగదారులకు బదిలీ చేయలేదని వివరించారు. వినియోగదారులపై ఈ ప్రభావం స్వల్పంగానే ఉందన్నారు.