Pension schemes: 'ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ క్రమం తప్పని ఆదాయం ఉంటుంది. సంపాదన ఆగిపోయిన రోజున పింఛను మీద ఆధారపడాల్సిందే. సంపాదించేటప్పుడే అందుకు ఏర్పాట్లు చేసుకుంటేనే పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లేని జీవితం సాధ్యం అవుతుంది. మన సగటు ఆయుర్దాయం 75 ఏళ్లకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక భరోసా కల్పించుకోవడం ఎంత ముఖ్యమన్నదీ అర్థం అయ్యింది. అందుకే, దేశంలో పింఛను పథకాలకు ఆదరణ పెరుగుతోంది' అని అంటున్నారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమిత్ మోహింద్ర. చిన్న కుటుంబాలు పెరుగుతున్న నేపథ్యంలో పింఛను పథకాల్లోనూ వృద్ధి మరింత ఉంటుందని అంటున్న ఆయన 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రస్తుతం దేశంలో పదవీ విరమణ ప్రణాళికలు, పింఛను పాలసీల పరిస్థితి ఎలా ఉంది?
కొవిడ్-19 ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేసింది. అందరూ తమ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పని ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవడమూ ప్రాధాన్యంగా మారింది. ఆర్‌బీఐ కమిటీ గతంలో ఇచ్చిన నివేదిక ప్రకారం కేవలం 23శాతం మంది భారతీయులే తమ పదవీ విరమణ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు. 2021లో 65 ఏళ్ల వయసు దాటిన వారు 10.1శాతం ఉండగా.. 2031 నాటికి ఈ సంఖ్య 13.1 శాతానికి చేరుకుంటుందని అంచనా. జాతీయ స్టాటిస్టికల్ సమాచారం ప్రకారం 2018లో పింఛను పథకాల పొదుపు మొత్తం రూ.25.07లక్షల కోట్లు ఉండగా, 2020-25 నాటికి ఇది రూ.62.35లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)కు క్రమంగా ఆదరణ పెరుగుతుండటం ఇందుకు కలిసొస్తుందని చెప్పొచ్చు.
గత పదేళ్ల కాలంలో పింఛను, పదవీ విరమణ పథకాల గురించి ఎంత మేరకు అవగాహన పెరిగింది?
ప్రజలు పదవీ విరమణ పథకాల అవసరాన్ని గుర్తిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే పనిచేసే వారిలో దాదాపు 12-13 శాతం ఏదో ఒక పింఛను పథకం రక్షణలో ఉన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం స్వావలంబన పథకం, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) తదితర పథకాలను ప్రారంభించింది. ప్రజల్లో పొదుపు అలవాటును పెంచడం, తద్వారా వారి మలి జీవితంలో ఆర్థిక రక్షణ కల్పించడమే వీటి ప్రధాన లక్ష్యం. పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహించే ఏపీవైలో 2018లో 96లక్షల మంది చందాదారులు ఉండగా, అక్టోబరు 2021 నాటికి 3.19 కోట్ల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీన్నిబట్టి, ప్రజలకు పదవీ విరమణ తర్వాత పింఛను గురించి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.