తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనా కంపెనీలకు పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డేటా లీక్‌.. నిజమెంత? - చైనా కంపెనీలకు పేటీఎమ్​ డేటా లీక్​

Paytm Data Leak: డిజిటల్​ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్​ డేటా లీక్​ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. పేటీఎం మాత్రం ఈ వార్తలను ఖండించింది. కంపెనీపై ఆర్‌బీఐ చర్యలకు కారణం.. చైనా కంపెనీలకు డేటా లీక్‌ కావడమే అన్న కథనాలు 'తప్పుడివి, సంచలనం కోసం రాసినవ'ని పేర్కొంది. అయితే కొత్త ఖాతాలు ప్రారంభించకుండా పేటీఎమ్​ చెల్లింపుల బ్యాంకుపై ఆర్​బీఐ ఆంక్షలు విధించింది.

paytm data leak
paytm data leak

By

Published : Mar 15, 2022, 7:11 AM IST

Paytm Data Leak: 'కొత్త ఖాతాలు ప్రారంభించకుండా పేటీఎమ్‌ చెల్లింపుల బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆంక్షలు విధించేందుకు కారణం.. ఈ బ్యాంక్‌లో పరోక్షంగా వాటా ఉన్న చైనా కంపెనీలతో, సర్వర్లు సమాచారాన్ని పంచుకున్నాయని తనిఖీల్లో తేలడేమనని' ఈ అంశాలతో సంబంధమున్న వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్లపత్రిక పేర్కొంది. పేటీఎమ్‌, కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మల సంయుక్త సంస్థే పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్స్‌, ఆ కంపెనీ అనుబంధ సంస్థ, జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ కోలకు పేటీఎమ్‌లో వాటాలున్నాయి. విదేశాల్లోని సర్వర్లకు సమాచారాన్ని పంపి, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందునే ఆర్‌బీఐ చర్యలు తీసుకుందని ఈ అంశాలతో దగ్గరి సంబంధమున్న ఒక వ్యక్తి తెలిపారు.

సంచలనం కోసమే ఆ వార్తలు: పేటీఎమ్‌

పేటీఎం మాత్రం ఈ వార్తలను ఖండించింది. కంపెనీపై ఆర్‌బీఐ చర్యలకు కారణం.. చైనా కంపెనీలకు డేటా లీక్‌ కావడమే అన్న కథనాలు 'తప్పుడివి, సంచలనం కోసం రాసినవ'ని పేర్కొంది. 'పూర్తి దేశీయ బ్యాంకుగా ఉన్నందుకు పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ గర్విస్తోంది. డేటా స్థానికీకరణపై ఆర్‌బీఐ మార్గదర్శకాలను కంపెనీ పూర్తిగా పాటిస్తోంది. బ్యాంకు డేటా మొత్తం భారత్‌లోనే ఉంద'ని ట్వీట్‌ చేసింది.

ఐటీ కార్యకలాపాల ఆడిట్‌పై నిబంధనలు!

పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు చెందిన సమాచార సాంకేతిక(ఐటీ) వ్యవస్థపై నిర్వహించే ఆడిట్‌కు మార్గదర్శకాలను ఆర్‌బీఐ నిర్ణయించవచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్‌'కు తెలిపారు. 'ఆర్‌బీఐతో చర్చించి ఈ వ్యవస్థలకు ఒక ప్రతిష్ఠాత్మక ఆడిటర్‌ను (బయటి నుంచి) పేటీఎమ్‌ నియమించాల్సి ఉంటుంద'నీ ఆ వర్గాలు వివరించాయి.

రూ.100 పెడితే.. రూ.31 మిగిలాయ్‌

పేటీఎం మాతృసంస్థ 'వన్‌97 కమ్యూనికేషన్‌' షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు 'నష్ట'కన్నీరే మిగిలింది. నాలుగు నెలల వ్యవధిలోనే షేరు ఇష్యూ ధరలో 69 శాతం విలువ హరించుకుపోయింది. అంటే రూ.100 పెట్టుబడి పెడితే ఆ మదుపరికి రూ.31 మిగిలాయన్నమాట. 2021 నవంబరులో పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినప్పుడు ఇష్యూ ధర రూ.2,150 కాగా.. సోమవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి రూ.675.35కి దిగివచ్చింది. నిన్న ఒక్క రోజే షేరు విలువ 13 శాతం పతనమైంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో పర్యవేక్షణాపరమైన లోపాలను గుర్తించామని, అందువల్ల కొత్త ఖాతాలు తెరవకూడదంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించడం ఇందుకు కారణమైంది. బీఎస్‌ఈలో షేరు ఒక దశలో 14.52 శాతం క్షీణించి రూ.662.25కి దిగివచ్చింది.చివరకు 12.84 శాతం నష్టంతో రూ.675.35 వద్ద స్థిరపడింది. ఫలితంగా పేటీఎం మార్కెట్‌ విలువ రూ.6,429.92 కోట్లు తగ్గి రూ.43,798.08 కోట్లకు పరిమితమైంది.

ఇదీ చూడండి:డాలర్​కు ప్రత్యామ్నాయం.. అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి!

ABOUT THE AUTHOR

...view details