లగేజీ లేని ప్రయాణికులకు విమాన టికెట్లు మరింత చౌకగా లభించే అవకాశం ఉంది. ఇందుకోసం టికెట్ ధరలో చెక్ ఇన్ లగేజీ విభాగాన్ని విడదీసే యత్నాల్లో సంస్థలున్నాయి. ఇప్పటికే గోఫస్ట్ సంస్థ ఈ దిశగా అడుగులు వేయగా, దేశీయ విమానయాన విపణిలో అగ్రస్థానం కలిగిన ఇండిగో కూడా ప్రయాణికుల టికెట్ ధర తగ్గించి, చెక్-ఇన్ లగేజీపై విడిగా ఛార్జీలు వసూలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. కొవిడ్ పరిణామాల నుంచి విమానయాన రంగం కోలుకుని, సంస్థలు 100 శాతం సామర్థ్యంతో సర్వీసులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో మళ్లీ ధరల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ఫిబ్రవరిలోనే ప్రభుత్వ అనుమతి..
విమానయాన సంస్థలు బ్యాగేజీ లేని, చెక్‌ఇన్ బ్యాగేజీ లేని ప్రయాణికులకు ప్రత్యేక ఛార్జీలు నిర్ణయించవచ్చని, కొన్ని సేవలకు విడిగా ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని గతేడాది ఫిబ్రవరిలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. అప్పట్లో కొవిడ్ విజృంభించడంతో ఛార్జీల విభజన(అన్‌బండ్లింగ్ ఆఫ్ ఫేర్స్)ను ఇండిగో అమలు చేయలేదు. సర్వీసులు పునఃప్రారంభమయ్యాక ఛార్జీలు, సీటింగ్ సామర్థ్యంపై పరిమితులు విధించడంతో తదుపరి కూడా నిర్ణయం తీసుకోలేకపోయినట్లు ఇండిగో సీఈఓ రోనోజాయ్ దత్తా పేర్కొన్నారు. 'మేం ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తూనే ఉన్నాం. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు పరిస్థితులన్నీ సర్దుమణగాలని భావించిన'ట్లు తెలిపారు. ఇప్పుడు విమాన టికెట్ల నుంచి బ్యాగేజీ ఛార్జీలను విడదీయడం ద్వారా, అత్యంత అందుబాటు ధరలో ఉన్న విమానయాన సంస్థగా మారాలన్నది ఇండిగో ఉద్దేశం. ఛార్జీల విభజనతో బ్యాగేజీ లేనివారికి టికెట్ ధరలు మరింత కిందకు దిగివస్తాయి.