కొవిడ్-19 రెండోదశ తీవ్రత హెచ్చి ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో జ్వరం, యాంటీ-బయాటిక్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లకు మళ్లీ గిరాకీ పెరిగింది. జ్వరానికి వాడే పారాసెట్మాల్ ట్యాబ్లెట్ల అమ్మకాలు బాగా పెరిగినట్లు ఔషధ కంపెనీలు, రిటైల్ దుకాణాల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. కొవిడ్-19 వ్యాధి మొదటి లక్షణం జ్వరం రావడం. ఆ తర్వాత గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, ఆయాసం.. కనిపిస్తున్నాయి. వ్యాధి నిర్థారణ అయిన వెంటనే పారాసెట్మాల్ తో పాటు కొన్ని యాంటీ-బయాటిక్ ఔషధాలు, యాంటీ-వైరల్ ఔషధాలతో పాటు త్వరగా శక్తి పుంజుకోడానికి వీలుగా విటమిన్ ట్యాబ్లెట్లను వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఇటీవల కొవిడ్-19 బాధితుల సంఖ్య మళ్లీ బాగా పెరిగి ఈ మందులు కొనుగోలు చేయడం ఎంతో పెరిగింది. దీనివల్ల పారాసెట్మాల్, అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, లెవోసిట్రిజిన్, మాంటెలుకాస్ట్.. తదితర ఔషధాలకు డిమాండ్ హెచ్చింది.
దేశ-విదేశీ మార్కెట్లకు ఇవీ
ఇక కొవిడ్-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు ఫావిపిరవిర్ బిళ్లలు, ఇంకా అధికంగా ఉంటే ఆసుపత్రిలో చేర్చుకుని రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్ కొరత ఏర్పడగా, సరఫరాలు పెంచేందుకు ప్రభుత్వం, ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పాటు పారాసెట్మాల్, యాంటీ-బయాటిక్ ఔషధాల తయారీని సైతం ఫార్మా కంపెనీలు అధికం చేశాయి. దేశీయ అవసరాలకు మాత్రమే కాకుండా ఐరోపా, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి పారాసెట్మాల్, యాంటీ-బయాటిక్ ఔషధాలకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. పారాసెట్మాల్ ముడిపదార్థాల ధరలూ ఇటీవల బాగా పెరిగాయి.
హైదరాబాదీ కంపెనీల్లో..
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా పారాసెట్మాల్ తయారీలో అగ్రగామిగా ఉంది. దీంతో పాటు డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా యాంటీ-బయాటిక్ ఔషధాలు భారీఎత్తున తయారు చేస్తున్నాయి. కొవిడ్-19 బాధితులకు వైద్యులు సిఫారసు చేస్తున్న మందుల తయారీని ఈ కంపెనీలు గణనీయంగా పెంచినట్లు తెలుస్తోంది. దేశంలో ఇతర అగ్రగామి ఫార్మా కంపెనీలైన సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్, సన్‌ఫార్మా.. కూడా ఈ ఔషధాల తయారీని పెంచినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఫావిపిరవిర్ తయారీ పునఃప్రారంభం