కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితితో అంతర్జాతీయంగా కరెన్సీకి డిమాండ్ పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో నగదును తగ్గించడంలో నోట్ల రద్దు విఫలమైందన్న విమర్శలను తోసిపుచ్చాయి. డీ-మానిటైజేషన్ తర్వాత పెరిగిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ.. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించిందని స్పష్టం చేశాయి.
75 ఏళ్లలో అత్యధికంగా..
అమెరికాలోనూ నగదు చలామణి భారీగా పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2020లో 2.07 ట్రిలియన్ డాలర్ల (రూ.153 లక్షల కోట్లు) విలువైన నోట్లు చలామణి జరిగినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే.. ఇది 16శాతం ఎక్కువని వివరించాయి. 1945 తర్వాత ఒకే ఏడాదిలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని తెలిపాయి.
ఆర్థిక వృద్ధి, వడ్డీరేట్లతో పాటు మరికొన్ని అంశాలపై నగదు డిమాండ్ ఆధారపడి ఉంటుంది. ఆర్థిక ఒడుదొడుకులు ఎదురైన సమయంలో నగదుకు గిరాకీ పెరగడం సాధారణం. 2020-21లో కరెన్సీ నోట్లకు గిరాకీ పెరగడానికి కరోనా ముఖ్య కారణం.